ఉద్యోగ భద్రత కల్పించండి..

ఉద్యోగ భద్రత కల్పించండి..

-దేవాదాయ శాఖలో ఎంఎల్‌ఓ సిబ్బంది ఆవేదన

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి: “దేవుని కొలువులో భక్తులకు సేవ చేయడమే మా ధ్యేయం.. కానీ మూడు దశాబ్దాలుగా ఆలయాలనే నమ్ముకుని సేవ చేస్తున్నా మా బతుకులకు భరోసా కరువైంది. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారింది” అని దేవాదాయ శాఖలోని ఎంఎల్‌ఓ (మినిమం టైమ్ స్కేల్) ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ఈ మేరకు ద్వారకా తిరుమల కేంద్రంగా పనిచేస్తున్న “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రచార దేవాలయ ఎం.ఎల్.ఓ ఉద్యోగుల సంఘం” ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి (ముఖ్య కార్యదర్శి) ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.

ప్రముఖ ఆలయాల్లో అల్ప వేతనాలతోనే విధులు:
రాష్ట్రంలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలైన విజయవాడ దుర్గగుడి (ఇంద్రకీలాద్రి), శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, పెనుగంచిప్రోలు, కాణిపాకం తదితర దేవాలయాల్లో దాదాపు 20 నుండి 30 సంవత్సరాలుగా తాము నిరంతరాయంగా సేవలు అందిస్తున్నామని ఉద్యోగులు ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు. జీవితాంతం ఆలయ సేవలోనే గడిచిపోతున్నప్పటికీ, ఇప్పటివరకు ఉద్యోగ క్రమబద్ధీకరణ (Regularization) నోచుకోకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో, భక్తులకు ఉత్తమ సేవలు అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటున్నప్పటికీ తమ న్యాయమైన సమస్యలు మాత్రం దశాబ్దాలుగా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రెగ్యులర్ ఉద్యోగావకాశం కల్పించాలని విజ్ఞప్తి:
ప్రస్తుతం ఎంఎల్‌ఓ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులుగా కొనసాగుతున్న తమ సుదీర్ఘ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని సంఘం నేతలు కోరారు. తమను డి.పి. (DP), హెచ్‌ఓడీ (HOD) బేసిక్ రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చి, తద్వారా తమ కుటుంబాలకు ఆర్థిక మరియు జీవన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ ఆవేదనను పెద్దమనసుతో అర్థం చేసుకుని, ప్రభుత్వం దయ చూపాలని వేడుకున్నారు.

దేవాదాయ శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం ఈ వినతిపత్రంతో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కోర్టు కేసులు, ఉద్యోగ సంఘాల ఆందోళనల నేపథ్యంలో.. దశాబ్దాలుగా నమ్ముకున్న ఈ అల్ప వేతన సిబ్బంది పట్ల కూటమి ప్రభుత్వం ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Leave a Reply