కేసముద్రంలో అగ్నిప్రమాదం..

కేసముద్రంలో అగ్నిప్రమాదం..

  • ప్రమాద వశాత్తూ వరి గడ్డి, నూర్పిన ధాన్యం ఆహుతి
  • సుమారు 150 ఎకరాల్లో వ్యాప్తి చెందిన మంటలు
  • సుమారు రూ.5 లక్షల రూపాయల వరకు నష్టం
  • కోరుకొండపల్లి గ్రామంలో సంఘటన

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 150 ఎకరాల్లో వరి గడ్డి, నూర్పిడి చేసిన ధాన్యం దగ్ధమై రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం సమయంలో కోరుకొండపల్లి గ్రామ శివారులోని వరి పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న రైతులు మండలు, ఆకులు వంటి అందుబాటులో ఉన్న సామగ్రితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ ప్రమాదంలో పలువురు రైతులు కట్టలు కట్టిన వరి గడ్డి వాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే నూర్పిడి చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం కుప్పలు కూడా మంటల్లో కాలిపోయాయి.

రూ.5 లక్షల వరకు నష్టం

మంటల్లో మండేపల్లి శ్రీకాంత్, మడిపెల్లి కొమురయ్య, పోలేపాక సాంబయ్య, రడపాక వెంకటమ్మ, దాసరి నర్సయ్య, సరోజన, చంద్రయ్యలకు చెందిన సుమారు 20 పుట్ల వరి ధాన్యం దగ్ధమైనట్లు రైతులు తెలిపారు.

అదేవిధంగా గడ్డి కట్టలు కాలిపోయిన రైతుల్లో చెలుగుల దేవేందర్ (300 కట్టలు), బిరు శీను (280), దద్దు వెంకన్న (300), దాసరి ఐలయ్య (250), దాసరి రాంబాబు (100), బీరం జైపాల్ రెడ్డి (150) తదితరులు ఉన్నారు. మరికొందరు రైతుల గడ్డి వాములు, కట్టలు కట్టేందుకు సిద్ధంగా ఉంచిన లూజ్ గడ్డి కూడా పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘాల నాయకుడు చొప్పరి శేఖర్ డిమాండ్ చేశారు.

Leave a Reply