వేటకొడవలి దాడిలో యువకుడు మృతి

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కల్లు మండువలో జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. గోడిశాల విజయ్ కళ్యాణ్ (30)పై అక్కినపల్లి అఖిల్ (32) వేటకొడవలి, కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన విజయ్ కళ్యాణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం గీతా కార్మికుడు విజయ్ కళ్యాణ్‌తో కలిసి అఖిల్ కల్లు సేవిస్తున్న సమయంలో వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీయడంతో అఖిల్ ఒక్కసారిగా వేటకొడవలితో విజయ్ కళ్యాణ్ మెడపై దాడి చేసి, కత్తిపోట్లు పొడిచినట్లు సమాచారం.
దాడిలో తీవ్ర రక్తస్రావానికి గురైన విజయ్ కళ్యాణ్‌ను అక్కడున్న గీతా కార్మికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
ఘటన అనంతరం నిందితుడు అఖిల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
