కౌలాస్ కోట పాలకుల రాజ చిహ్నాలు

కౌలాస్ కోట పాలకుల రాజ చిహ్నాలు
- కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశీలన
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:
క్షేత్రస్థాయి పరిశోధనలలో భాగంగా భీమ్‌గల్ మండలానికి చెందిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కంకణాల రాజేశ్వర్ చారిత్రాత్మక, శత్రు దుర్భేద్యమైన గిరిదుర్గం కౌలాస్ కోటను సందర్శించారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉన్న ఈ కోటలోని అనేక ముఖ ద్వారాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్వ పాలకుల పరిపాలనకు నిదర్శనంగా, కోటల పైభాగంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా అబ్బురపరిచే అందమైన రాజ చిహ్నాలను చెక్కించినట్లు గుర్తించారు.
ఈ రాజ చిహ్నాల విశేషాల గురించి కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ప్రత్యేకంగా వివరించారు. రెండు నోళ్లతో, రెండు కాళ్లతో ఏనుగులను కరిచి పట్టుకున్న గండభేరుండం పక్షి, దానికి ఇరువైపులా సింహాలు, ఆ సింహాల పక్కన ముక్కుతో పట్టుకున్న రెండు హంసల రూపాలు కౌలాస్ కోట పాలకుల రాజ చిహ్నాలని ఆయన స్పష్టం చేశారు. సింహం కాళ్ల కింద కూడా ఏనుగుల రూపాలు చెక్కి ఉన్నాయని, దీనిని బట్టి ఇక్కడి పాలకులను అరిగజకేసరులుగా భావించవచ్చని చెప్పారు. ముఖ్యంగా గండభేరుండాన్ని వైష్ణవ మతస్తులు ఎంతో పవిత్రంగా గౌరవిస్తూ తమ అధికారిక రాజ చిహ్నంగా పెట్టుకున్నారని హరగోపాల్ విశ్లేషించారు.
చరిత్ర బృందం సభ్యులు కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక కౌలాస్ కోటను తొమ్మిదవ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించారని తెలిపారు. ఈ కోటను క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు మరింత విస్తరించి, శత్రువులకు చిక్కని పటిష్టమైన నిర్మాణాలుగా మార్చారని చెప్పారు. తర్వాతి కాలంలో ఈ కోటను బాదామి చాళుక్యులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, మరాఠాలు, నిజాం రాజులు పరిపాలించారని గుర్తుచేశారు. ఎంతో వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ కోటకు రక్షణగా 52 నుండి 57 వరకు భారీ బురుజులు ఉన్నాయని రాజేశ్వర్ వివరించారు. ఈ చారిత్రాత్మక క్షేత్ర సందర్శన కార్యక్రమంలో కండక్టర్ నర్సయ్య కూడా పాల్గొన్నారు.
