Telangana Liquor Prices | మద్యం ధరల పెంపుకు ప్రభుత్వ కసరత్తు

Telangana Liquor Prices | మద్యం ధరల పెంపుకు ప్రభుత్వ కసరత్తు

Telangana Liquor Prices | ఖజానాకు వేల కోట్ల అదనపు ఆదాయం లక్ష్యం
శ్లాబ్ సిస్టమ్‌తో కొత్త ధరల విధానం
కర్ణాటక మద్యం పాలసీపై తెలంగాణ దృష్టి
లిక్కర్, బీర్ ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం

Telangana Liquor Prices | హైదరాబాద్, ఆంధ్రప్రభ: మద్యం మంటలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ట్ర రాబడులు పెంపు చర్యల్లో భాగంగా మద్యం ధరలను భారీగా పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరల నిర్ధాయక కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో ఒకట్రెండు రోజుల్లో సీఎం ఈ అంశంపై సమీక్షించనున్నారు. ఆయన సమీక్ష తర్వాత తెలంగాణలో లిక్కర్, బీర్ ధరలు భారీగా పెరగనున్నాయన్న చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జోరందుకుంది.

ఇప్పటికే ఈ అంశంపై ఎక్సైజ్ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గాజు తయారీకి అవసరమైన ఎల్పీజీ కొరత ఏర్పడిందని, ఎక్కువ ధరకు కొనాల్సి వస్తున్నదని, ఉత్పత్తి వ్యయం పెరిగినందున కనీసంగా 15 శాతం పెంచాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిస్టిల్లరీలు, బ్రూవరీలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.

ఇదే అదునుగా భావించిన ప్రభుత్వం ధరల పెంపును సాకుగా చూపి ఖజానాకు భారీ రాబడికి స్కెచ్ వేసింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ధరల పెంపుపై తాజాగా ప్రభుత్వానికి సానుకూల నివేదిక ఇచ్చింది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. మొత్తమ్మీద ఈ నెల చివరకు లేదా వచ్చే నెలలో రేట్లు పెరగొచ్చని వైన్ షాపుల యజమానులు భావిస్తున్నారు.

ఏడాదికి రూ.5 వేల కోట్ల మేర ఖజానాకు ఆదాయం

సాధారణ బ్రాండ్లపై ఫుల్ బాటిలు కనీసంగా రూ.60 పెరిగే అవకాశమున్నది. ప్రీమియం బ్రాండ్లకు రూ.100, హై-ఎండ్ బ్రాండ్లకు రూ.120 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నది. మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పెంచాలనుకోవడం లేదు. దీనికి బదులు ధరల సవరణ (క్రమబద్ధీకరణ) పేరుతో సైజు, బ్రాండ్ కేటగిరీ ఆధారంగా ‘శ్లాబ్ సిస్టమ్’ పద్ధతిలో ధరలు పెంచే యోచనలో ఉన్నది.

ధరల పెంపుతో ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.150 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా. గతేడాది మే నెలలో క్వార్టర్‌కు రూ.10 చొప్పున స్వల్పంగా ధరలు పెరిగాయి. ఇప్పుడు సమగ్ర సవరణకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది.

ధరల క్రమబద్ధీకరణ చేసిన కర్ణాటక సర్కార్

కర్ణాటక ప్రభుత్వం మద్యం ధరల నియంత్రణను పూర్తిగా ఎత్తివేస్తూ శ్లాబులను తగ్గించింది. కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పొరుగు రాష్ట్రాలకంటే ధరలు తక్కువగా ఉండేలా చూస్తూనే, ఆదాయాన్ని పెంచుకునేలా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఇతర హామీల అమలుకు భారీగా నిధులు అవసరం అవుతున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి, మద్యం కంపెనీల డిమాండ్లను నెరవేర్చడానికి ఎక్సైజ్ శాఖ సిఫారసుల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

కర్ణాటక అనుసరిస్తున్న సరికొత్త పాలసీ తెలంగాణ ప్రభుత్వానికి ఒక కేస్ స్టడీగా మారనుంది. ఆ రాష్ట్రం తరహాలోనే ప్రభుత్వ నియంత్రణను తగ్గించి బ్రాండ్ల ధరల నిర్ణయాధికారాన్ని కంపెనీలకే వదిలేయడంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియజేయనున్నది.

Leave a Reply