కార్పొరేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు

కార్పొరేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు

  • కోనాపూర్ హెచ్ఎం చౌడారపు రాంప్రసాద్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ:
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతోందని, అన్ని రకాల ఆధునిక మౌలిక వసతులను కల్పిస్తోందని కోనాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) చౌడారపు రాంప్రసాద్ తెలిపారు. సోమవారం కోనాపూర్ గ్రామ పంచాయతీ జనరల్ బాడీ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ప్రత్యేకంగా పాల్గొని, ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విప్లవాత్మక మార్పులు, అధునాతన విద్యా సౌకర్యాలపై గ్రామ పాలకమండలికి, ప్రజలకు సుదీర్ఘంగా వివరించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. స్మార్ట్ క్లాస్ రూములలో ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రొజెక్టర్లు, స్మార్ట్ బోర్డుల ద్వారా పాఠాలను దృశ్య-శ్రవణ (ఆడియో-విజువల్) రూపంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నట్లు వివరించారు.

స్కూల్ భవనాలకు ఆకర్షణీయమైన రంగులు వేయడం, గ్రీనరీ, కిచెన్ గార్డెన్లు పెంచడం ద్వారా పాఠశాలలను ఎంతో ఆహ్లాదకరంగా, సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అలాగే విద్యార్థుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మిషన్ భగీరథ , ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తూ, బాలబాలికలకు విడివిడిగా ఆధునిక మరుగుదొడ్ల వసతి కల్పించినట్లు పేర్కొన్నారు.

మారుతున్న పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టామని, విద్యార్థుల సౌకర్యార్థం ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీష్ ఉండేలా ద్విభాషా పాఠ్యపుస్తకాలను ముద్రించామని తెలిపారు. 1 నుండి 10వ తరగతి విద్యార్థులందరికీ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉచితంగా టెక్స్ట్‌బుక్స్, వర్క్‌బుక్స్, నోట్‌బుక్స్ , అభ్యాస దీపికలను అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్యా అర్హతలు కలిగి, కఠినమైన పోటీ పరీక్షల ద్వారా ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారని, ముఖ్యంగా కోనాపూర్ స్కూల్లో 25 నుండి 40 సంవత్సరాల సుదీర్ఘ బోధనా అనుభవం ఉన్న నిపుణులు విద్యాబోధన అందిస్తున్నారని స్పష్టం చేశారు.

విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రతిరోజూ ప్రత్యేక మెనూతో గుడ్డు, పప్పు, సాంబారు, వెజిటబుల్ రైస్ లాంటి వేడివేడి నాణ్యమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంగా వడ్డిస్తున్నామని హెచ్ఎం వివరించారు. పిల్లల మధ్య ఎలాంటి బేధాలు లేకుండా అందరిలో సమానత్వం పెంపొందించేలా ప్రతి ఏటా రెండు జతల ఉచిత స్కూల్ యూనిఫాంలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా విద్యార్థులకు క్రమం తప్పకుండా ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేస్తున్నట్లు చెప్పారు.

సైన్స్, గణిత పాఠాలను ప్రాక్టికల్‌గా నేర్చుకోవడానికి వీలుగా సైన్స్, మ్యాథ్స్ కిట్ ప్రయోగశాలలను, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచడానికి కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చదువుతో పాటు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఫుట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, క్యారమ్స్, చెస్, షటిల్ బాడ్మింటన్, టెన్నికాయిట్, స్కిప్పింగ్ వంటి క్రీడలకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచామని, బాలికల ఆత్మరక్షణ కోసం కరాటే వంటి విద్యలను కూడా నేర్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు ఉచితంగా లభిస్తుండటంతో, పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాయని హెచ్ఎం రాంప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ ప్రైవేట్ బడుల వైపు వెళ్లకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ గొప్ప సౌకర్యాలను వాడుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ సమాచార అవగాహన కార్యక్రమంలో కోనాపూర్ గ్రామ సర్పంచ్ రీక్కల అరుణ్ రెడ్డి, ఉప సర్పంచ్ మోర్తాడు ఉదయ్, పంచాయతీ కార్యదర్శి నవీన్, వివిధ వార్డుల సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply