ప్రతి మనిషి నిత్యజీవితంలో యోగా ఒక భాగం కావాలి

ప్రతి మనిషి నిత్యజీవితంలో యోగా ఒక భాగం కావాలి

  • ఎంపీడీవో విజయ్ కుమార్, సీఐ పులి రమేష్

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ:
ప్రతి మనిషి తన నిత్యజీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని ఎల్కతుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత యాంత్రిక జీవనంలో యోగా అనేది మనిషి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఒత్తిడిని దూరం చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి యోగా ఒక అద్భుతమైన సాధనమన్నారు.

అనంతరం స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులి రమేష్ మాట్లాడుతూ.. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలడని, ఆరోగ్యం లేకపోతే సంపాదించిన సంపద అంతా శూన్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించాలని సూచించారు.

యోగా గురువుకు ఘన సన్మానం – అవగాహన ర్యాలీ
ఈ సందర్భంగా శిక్షకుడిగా వ్యవహరించిన ప్రముఖ యోగా గురువు కొమురవెల్లి వెంకటేశ్వర్లు (వెంకన్న)ను అధికారులు, ప్రజాప్రతినిధులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం యోగాపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఎంపీడీవో కార్యాలయం నుండి స్థానిక బస్టాండ్ వరకు భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు.

ఈ ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి రవి, ఎస్సై నరసింహారావు, ఎల్కతుర్తి సర్పంచ్ మునిగడప లావణ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లెపోగు రమేష్ బాబు, ఆల్ ఇండియా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్, 1వ వార్డు సభ్యుడు శనిగరం సాహు, బీఆర్‌ఎస్ నాయకులు గోడిశాల వినయ్, సీఏ కవిత, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్/మండల సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply