ఎస్ఎస్సీ సప్లిమెంటరీ, ఏపీఓఎస్ఎస్ పరీక్షలు..
ఎస్ఎస్సీ సప్లిమెంటరీ, ఏపీఓఎస్ఎస్ పరీక్షలు..
జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి : డీఈఓ యు.వి సుబ్బారావు..
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లాలో ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు-2026తో పాటు ఏపీఓఎస్ఎస్ (ఎస్ఎస్సీ & ఇంటర్మీడియట్) పరీక్షల నిర్వహణకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి సుబ్బారావు తెలిపారు. మే 25 నుంచి జూన్ 4 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3313 మంది ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ విద్యార్థులు, 575 మంది ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సీ విద్యార్థులు, 1103 మంది ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు.
పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 17 ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాలు, 5 ఏపీఓఎస్ఎస్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సోమవారం జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్టీసీ, పోస్టల్ శాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొని పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, విద్యార్థులకు రవాణా సౌకర్యం, విద్యుత్ సరఫరా, వైద్య సహాయం తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
