పెట్రో ధరల పెంపుపై సీపీఎం నిరసన..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్రంలోని మోడీ సర్కార్ సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మండిపడ్డారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గంగాదేవి సైదులు, గోశిక కరుణాకర్ మాట్లాడుతూ… ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచి ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన పది రోజుల్లోనే లీటరుకు 3 రూపాయలకు పైగా ధరలు పెంచడం సరికామన్నారు. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి రేట్లు పెంచడం వల్ల నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, కొండే శ్రీశైలం, బోయి యాదయ్య, తూర్పునూరి మల్లేశం, కందగట్ల ఆనంద్, భావనలపల్లి స్వామి, యాట బాలరాజు, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు.