సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తా..

సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తా..
ప్రతి ఎకరాకు సాగునీరు
…మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఆంధ్ర ప్రభ ” ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగనీరు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం లోని అక్కేపల్లి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన అక్కేపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు రోల్లవాగు ప్రాజెక్టు, వెల్గటూర్ ఎత్తిపోతల పథకం, పత్తిపాక రిజర్వాయర్ పనులను పూర్తి చేస్తామన్నారు.

అక్కెపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగిందని, ఇందుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి శ్భట్టి విక్రమార్క ని కలవడం జరిగిందని వివరించారు. ఏడాదిలోపు పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు, అక్కేపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిర్వహించే ఏజెన్సీ పనిచేయకపోవడంతో వారి స్థానంలో కొత్త ఏజెన్సీకి అవకాశం కల్పించామన్నారు.
అక్కేపల్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభించి రైతుల సూచనలు మేరకు నియోజకవర్గంలోని 5వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు.
గత ప్రభుత్వ కాలంలో రోల్ల వాగు ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతి లేకుండానే పనులు ప్రారంభించారని, ప్రాజెక్టు అంచనాలు పెంచి రైతులకు ఒక ఎకరానికి సైతం నీళ్లు ఇవ్వలేదన్నారు. రోళ్ళ వాగు ప్రాజెక్టు అటవీ శాఖ అనుమతులు సాధించి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం మొదటి విడతగా రూ. 118 కోట్లు విడుదల చేసిందని ఇందుకు సంబంధించిన పనుల టెండర్లు త్వరలోనే పూర్తి అవుతాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సమన్వయం చేసుకొని పుష్కరాల పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.
