ధాన్యం కొనుగోలు కేంద్రంలో సమస్యల పరిష్కారానికి కృషి

ధాన్యం కొనుగోలు కేంద్రంలో సమస్యల పరిష్కారానికి కృషి
- సింగిల్ విండో ఛైర్మన్ దామోదర్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
చౌటుప్పల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్. లింగోటం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సింగిల్ విండో ఛైర్మన్ చింతల దామోదర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్ నుంచి కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసినప్పటికీ, లారీల కొరత కారణంగా దిగుమతులు సకాలంలో జరగడం లేదని నిర్వాహకులు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. లారీలు రాక దిగుమతి కావడానికి 5 నుంచి 6 రోజుల సమయం పడుతోందని, దీనివల్ల తూకం వేసిన బస్తాలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయని వివరించారు.
దీంతో కొత్తగా వచ్చే ధాన్యానికి కాంటాలు వేయడం కష్టతరంగా మారిందని తెలిపారు. రైతుల ఇబ్బందులను గమనించిన ఛైర్మన్ దామోదర్ రెడ్డి తక్షణమే స్పందించి జిల్లా సివిల్ సప్లై మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య తీవ్రతను వివరించగా, రెండు రోజుల్లో రవాణా సమస్యను పరిష్కరిస్తామని మేనేజర్ హామీ ఇచ్చారు.
అలాగే ఏఎంసీ చౌటుప్పల్ గిడ్డంగిలో హమాలీల సంఖ్యను పెంచుతున్నామని, దీనివల్ల తాళ్ళసింగారం, ఎస్. లింగోటం కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం దిగుమతులు వేగవంతం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ఢిల్లీ మాధవరెడ్డి, ఉప్పు కృష్ణ, చెన్నగోని వెంకటేశం, ఆకుల అశోక్, పల్లం రమేష్, బండారు లింగయ్య, ఉప్పల కృష్ణయ్య, పిఎసిఎస్ కార్యదర్శి వై. రమేష్, సిబ్బంది నరేష్ తదితరులు పాల్గొన్నారు.
