సీఎం పర్యటన.. ప్రైవేట్ డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం

సీఎం పర్యటన.. ప్రైవేట్ డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం

  • జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 16వ తేదీ న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా పరమైన చర్యల్లో భాగంగా ప్రైవేట్ డ్రోన్ కెమెరాల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం ఉదయం నుంచి ముఖ్యమంత్రి పర్యటన పూర్తై తిరిగి బయలుదేరిన అనంతరం శనివారం సాయంత్రం వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. నర్సన్నపేట నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు, హెలిప్యాడ్ పరిసరాలు, సభా ప్రాంగణం, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం, రహదారి మార్గాలు, పరిసర ప్రాంతాల్లో జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక అనుమతి లేకుండా ఎటువంటి ప్రైవేట్ డ్రోన్లు వినియోగించరాదని స్పష్టం చేశారు.

అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేయడం, వీడియోలు లేదా ఫోటోలు తీయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడం పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.