అణగారిన వర్గాల ఆత్మగౌరవ చిహ్నం పిడమర్తి

తొర్రూరు, ఆంధ్రప్రభ : దళితులు, అణగారిన వర్గాల ఆత్మగౌరవ చిహ్నం పిడమర్తి రవి అని దళిత ఉద్యమ నేత, సామాజిక ఉద్యమకారుడు మాంకాల మల్లేష్ అన్నారు.రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు సన్నిహితులు, అభిమానుల నడుమ గురువారం డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో నిర్వహించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కుట్టు శిక్షణ పొందే మహిళల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా జేఏసీ చైర్మన్ గా కీలకంగా వ్యవహరించి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేయడంలో పిడమర్తి పాత్ర ఎనలేనిదన్నారు. అంటరానితనం అనే అమానవీయ దురాచారానికి అత్యంత దారుణంగా బలైపోయిన మాదిగలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా న్యాయం చేయాలని పోరాటాలు చేశాడని గుర్తు చేశారు. సామాజిక ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించి అణగారిన వర్గాలకు గొంతుగా మారాడని కొనియాడారు.

మాదిగ జేఏసీ, బహుజన స్టూడెంటు ఫెడరేషన్ లు స్థాపించి అణగారిన వర్గాలను జాగృతం చేశాడని గుర్తు చేశారు. త్యాగాలే పునాదిగా దళితులు నిమ్న వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్న పిడమర్తికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకుడు రాయిశెట్టి ఉపేందర్ మాదిగ, ప్రతినిధులు రాయిశెట్టి ఉప్పలయ్య, మంగళపల్లి స్వామి, చిలుక మల్లేష్, యాకయ్య, సామాజిక కార్యకర్త మంగళపల్లి బాలాజీ, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు నాగరాజు, నరేష్, గుడెల్లి దయాకర్, చంద్రయ్య మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.