పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే దేవాలయాలు

పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే దేవాలయాలు

  • సర్పంచ్ తౌటం లక్ష్మి

చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులను తప్పనిసరిగా చేర్పించాలని చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి తల్లిదండ్రులను కోరారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రత్యేక విద్యా వారోత్సవాల్లో గురువారం చిట్యాల మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ తౌటం లక్ష్మి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూజజ పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే దేవాలయాల వంటివని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ప్రతి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని ఆమె సూచించారు. బడిబాట కార్యక్రమంలో అర్హులైన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాల, కేజీబీవీ గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కేజీబీవీలో 90 శాతానికి పైగా హాజరు నమోదు చేసిన ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రశంసాపత్రాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రఘుపతి, సదయ్య, రమేష్ సుమలత, నాలుగో వార్డు సభ్యుడు తౌటం నవీన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.