అంగన్వాడి సమస్యలపై జెడీకి వినతి…

అంగన్వాడి సమస్యలపై జెడీకి వినతి…
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఐసీడీఎస్ జేడీ శివజ్యోతి ని సీఐటీయూ, అంగన్వాడీ సంఘాల నాయకులు గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. పుట్టపర్తి పీడీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు జేడీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు వెంటనే పూర్తి చేయాలని, మినీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
అదేవిధంగా వేతనాల పెంపు, పని భారం తగ్గింపు, సేవా భద్రత కల్పన వంటి అంశాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే వారికి తగిన గుర్తింపు, సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ జిల్లా కార్యదర్శి వి. శ్రీదేవి మాట్లాడుతూ ఎన్నోసార్లు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని అన్నారు. ఈసారి జేడీ శివజ్యోతి సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాలు, అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు సి.ఎస్. శ్రీదేవి, కోశాధికారి రంగమ్మతో పాటు పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
