కెమెరాల నిఘాతో క్రైమ్‌కు చెక్!

కెమెరాల నిఘాతో క్రైమ్‌కు చెక్!

మహబూబ్‌నగర్‌ను యాక్సిడెంట్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతాం
ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి

మహబూబ్‌నగర్ క్రైమ్, ఆంధ్రప్రభ:

పట్టణంలో నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు కమ్యూనిటీ సీసీ కెమెరాలు కీలకమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్ట్‌లో భాగంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ను క్రైమ్ ఫ్రీ, యాక్సిడెంట్ ఫ్రీ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి వీధి, కూడలి, వ్యాపార సముదాయంలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే వన్‌టౌన్, టూ టౌన్ పరిధిలో సుమారు 200 కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలో మరో 300 నుంచి 400 కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారవేత్తలు, దాతలు, ప్రజలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, నేరస్తుల గుర్తింపులో కెమెరాలు కీలకంగా మారాయని చెప్పారు. ఇటీవల వారం రోజుల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు పది మంది మృతి చెందడం బాధాకరమన్నారు.

ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రమాదాలకు కారణమవుతున్న డివైడర్ కట్స్, ప్రమాదకర మలుపులు, అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహరెడ్డి, అదనపు ఎస్పీ ఎన్‌బి రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, టూ టౌన్ సీఐ ఇజాజ్ ఉద్దీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply