చిన్నారుల బంగారు భవితకు నవచేతన..
చిన్నారుల బంగారు భవితకు నవచేతన..
అభివృద్ధి ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించే వినూత్న చర్యలు
ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌తో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
కృష్ణలంక, ఆంధ్రప్రభ : చిన్నారుల బంగారు భవితకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవచేతన కార్యక్రమం విజయవంతానికి ప్రణాళికాయుత చర్యలు తీసుకున్నామని, పిల్లలు అన్ని విధాలా ఎదుగుదలలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం నగరంలోని కృష్ణలంక ప్రాంత భ్రమరాంబపురం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న నవచేతన కార్యక్రమం అమలుతీరును పరిశీలించారు. ప్రత్యేక యాప్‌లో సమాచారాన్ని పొందుపరుస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మాట్లాడుతూ చిన్నారుల్లో అభివృద్ధి ఆలస్యాలు, వైకల్యతను ప్రారంభ దశలోనే గుర్తించి వారికి తక్షణ సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం “ఈసీడీ నవచేతన” కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని.. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మొబైల్, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల అభివృద్ధి స్థాయిని అంచనా వేయొచ్చన్నారు. చిన్నారుల శారీరక, మానసిక, భాషా, సామాజిక, స్వయం సహాయక నైపుణ్యాలను పరిశీలించి సమస్యలను ముందుగానే గుర్తించే చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల ప్రవర్తన, మాట, కదలికలు, సామాజిక నైపుణ్యాలను పరిశీలించి స్క్రీనింగ్ డేటాను నమోదు చేస్తున్నారని.. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అవసరమైన పిల్లలను వైద్య, ఇతర నిపుణుల వద్దకు రిఫర్ చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ చిన్నారుల ప్రవర్తనలో మార్పులు, మాటల్లో ఆలస్యం లేదా ఇతర అభివృద్ధి సమస్యలు గమనించిన వెంటనే తల్లిదండ్రుల సహకారం ద్వారా పిల్లలకు సమయానికి సరైన సేవలు అందించేలా చేయవచ్చని.. వారి బంగారు భవితకు బాటలు వేయొచ్చని పేర్కొన్నారు. సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా సరైన చికిత్స, థెరపీ, ప్రత్యేక శిక్షణ అందించవచ్చన్నారు. ప్రతి చిన్నారికి సమాన అవకాశాలు కల్పించి పాఠశాల సిద్ధతను పెంపొందించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు.
