అత్యంత పారదర్శకంగా జన గణన

అత్యంత పారదర్శకంగా జన గణన
- ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : జన గణన – 2027 ప్రక్రియ జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జనగణన తొలిదశలో భాగంగా ఎనికేపాడులో జరుగుతున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్) ప్రక్రియను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి వచ్చే సిబ్బందికి సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన అనేది దేశ ప్రగతి, ప్రణాళికా రూపకల్పనకు అత్యంత కీలకమైన ప్రక్రియ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం వంటి రంగాల్లో భవిష్యత్ కార్యాచరణకు జనగణన గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో ఎటువంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఇంటి వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలని, అందుకోసం ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
