12thMayeditorial | విదేశీ మోజుపై ప్రధాని హెచ్చరిక

12thMayeditorial | విదేశీ మోజుపై ప్రధాని హెచ్చరిక
12thMayeditorial | నిరాడంబర నేతల జ్ఞాపకం తెచ్చిన మోడీ ప్రసంగం
పొదుపు మంత్రంతో ఆర్థిక క్రమశిక్షణకు పిలుపు
స్వదేశీ, సేంద్రీయ వ్యవసాయంపై సమయోచిత బోధ
బంగారం వినియోగ నియంత్రణపై కీలక సూచనలు
12thMayeditorial | అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య వంటి దిగ్గజాలు ఉండేవారు. వారు ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. వారి ఆహార్యంలోనే కాదు, మాటల్లోనూ నిరాడంబరత కనిపించేది. పొదుపు అనేది డబ్బు ఖర్చు చేయడంలోనే కాదు, మాటల్లో కూడా ఉండాలని వావిలాల వారు తరచూ అనేవారు. ప్రధాని మోడీ ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో చేసిన ప్రసంగం విన్న తర్వాత ఆ మాటలు గుర్తుకు వచ్చాయి. వావిలాల మాటలు ఎంత పొదుపో, అంత సూటిగానూ ఉండేవి. స్వచ్ఛమైన ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో ఆయన వేషభాషల్లో, మాటల్లో రుజువు చేశారు. అలాగే సుందరయ్య కూడా. నిక్కరు, భుజంపై తువ్వాలుతో కనిపించేవారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడం వల్ల ఆయన విమర్శలు సూదంటురాయిలా ఉండేవి. అయితే మనసు మాత్రం వెన్న. అచ్చమైన ప్రజాప్రతినిధులకు వీరు నిలువెత్తు నిదర్శనాలు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండేవారు.
ఇప్పుడు కాలం మారింది. ప్రజల్లో మార్పు వచ్చింది. పొదుపు గురించి ఎవరైనా మాట్లాడితే వెర్రివాళ్లలా, చేతగాని వారిగా చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ప్రజాప్రతినిధులను ఊహించలేం. ప్రధాని మోడీ పొదుపు గురించి ఎందుకు చెప్పారో ప్రజలకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఎంత అభివృద్ధి సాధించినా దేశం ఆర్థికంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. ఐదు ట్రిలియన్‌ల వైపు ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధిని సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఉంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7 శాతం ఉంది. ఈ తరుణంలో ప్రజల్లో పొదుపు మంత్రం పాటించాల్సిన అవసరం గురించి ప్రధాని చేసిన బోధ సమయోచితంగానే ఉంది.
విదేశీ మోజు తగ్గించుకోవాలన్న ఆయన మాటల్లో దేశాధినేత కనిపించారు. దేశంలో అన్నీ లభిస్తున్నప్పుడు విదేశీ వస్తువులపై, వస్త్రాలపై మోజు ఎందుకనేది సహేతుకమైన ప్రశ్న. జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లోనే స్వదేశీ ఉద్యమంపై బోధించారు. అలాగే, స్వదేశీ ఎరువులు, ముఖ్యంగా సేంద్రీయ ఎరువుల వాడకంతో అధికోత్పత్తిని సాధించాలన్న ఆయన ఉద్బోధ సమయోచితంగా ఉంది. బంగారంపై మోజు తగ్గించుకోమన్న ఆయన సలహా కూడా పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. బంగారంపై ప్రజల్లో మునుపటంతటి మోజు ఇప్పుడు లేదు. సంపన్నులు, వాణిజ్యవేత్తలు స్త్రీ, పురుష భేదం లేకుండా ఇప్పటికీ బంగారం మోజు నుంచి బయటపడలేకపోతున్నారు.
ఏడాది పాటు బంగారు వినియోగంపై స్వయం నియంత్రణ పాటించాలని ప్రధాని సలహా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులకు సమయోచిత పరిష్కారం. విదేశీ పర్యటనలపై కూడా ప్రభుత్వాల స్థాయిలో అధికారులకు, పాలకులకు ఇది వర్తిస్తుంది. అందువల్ల ప్రధాని మోడీ చేసిన ఉపదేశం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా శిరోధార్యం.
