పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

కేసముద్రం, ఆంధ్రప్రభ : పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ కేసముద్రం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్ భానోత్ సునీత వెంకన్న అన్నారు.

సోమవారం 99 రోజుల ప్రజాపాలన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో తొలి రోజు కార్యక్రమంగా వేసవి శిక్షణ శిబిరాన్ని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా శిక్షణ పొందాలని సూచించారు. అనవసరంగా తిరగడం, ఎండదెబ్బ బారిన పడకుండా పాఠశాలలో నిర్వహించే శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రత్యేక నైపుణ్యాలు సాధించవచ్చని తెలిపారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు బందెల రాజు మాట్లాడుతూ, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని డ్రాయింగ్, రైటింగ్, ఇండోర్ గేమ్స్ వంటి అంశాల్లో శిక్షణ పొందడం ద్వారా భవిష్యత్తులో అభివృద్ధి సాధించవచ్చన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు స్నాక్స్‌, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి, ఏఏపీసీ చైర్మన్ మంజుల, మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోట కనకయ్య, చంద్రశేఖర్, రాజశేఖర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.