గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో విద్యావారోత్సవాలు ప్రారంభం

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న “విద్యావారోత్సవాలు” సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి ప్రారంభించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు వారాంతం పాటు వివిధ విద్యా, అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతి రోజు ప్రత్యేక అంశాలతో కార్యక్రమాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణ కోసం సమన్వయకర్తలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. విద్యావారోత్సవాల తొలి రోజు కళాశాలలోని వివిధ విభాగాలు ఇతర విద్యా సంస్థలతో విద్యా అభివృద్ధి కోసం కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందాల (ఎంఓయూలు) గురించి అధ్యాపకులు వివరించారు.

ఈ ఒప్పందాల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రంగరత్నం, ఏవో రామ్ కిషన్, సమన్వయకర్తలు రాజేశ్, రంజిత, వినయ్ కుమార్, దండు స్వామి, బాలామణి, రామస్వామి, జయప్రసాద్, పూర్ణచందర్ రావు, కిరణ్ కుమార్ గౌడ్, ముత్తెన్నతో పాటు అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.