32 ఏళ్ల తర్వాత కలిసి..
32 ఏళ్ల తర్వాత కలిసి..
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : కాలం మారింది.. వేష భాషలు మారాయి.. బాధ్యతలు పెరిగాయి.. కానీ ఆ చిన్ననాటి స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం మండలంలోని కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా విడిపోయిన ఆ నేస్తాలంతా మళ్లీ ఒక్కటయ్యారు. 1993-94 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా, ఉద్వేగభరిత వాతావరణంలో జరిగింది.
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో, రకరకాల వృత్తుల్లో స్థిరపడిన విద్యార్థులందరూ హాజరయ్యారు. ఒకరినొకరు పేరుపేరునా పలకరించుకుంటూ, చిన్ననాటి అల్లరి పనులను, తరగతి గది జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ముప్పై ఏళ్ల విరామం తర్వాత కలిసిన ఆనందంలో చాలా మంది కళ్లలో నీళ్లు తిరగడం అక్కడి వారిని కదిలించింది.
తమను క్రమశిక్షణతో తీర్చిదిద్ది, ఈ రోజు సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో నిలబెట్టిన గురువులను విద్యార్థులు మరువలేదు. తమ ప్రియతమ ఉపాధ్యాయులు అచ్చయ్య, భవాని, వెంకటేశ్వర్లు, సైదాచారి, సైదులును ప్రత్యేకంగా ఆహ్వానించి, వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను తర్వాతి తరానికి అందించాలని ” “మనల్ని కన్న తల్లిదండ్రులను, వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవడమే మనం ఇచ్చే గొప్ప బహుమతి అని అన్నారు. “చదువే అన్నింటికీ మూలాధారం, ఎన్ని ఆటంకాలు ఎదురైనా జ్ఞాన సముపార్జనలో వెనకడుగు వేయకూడదని పేర్కొన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్, చదువుల తల్లి సరస్వతీ దేవి చిత్రపటాలకు పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి విద్యార్థి వేదిక పైకి వచ్చి తన వృత్తిని, ప్రస్తుత జీవన స్థితిని మిత్రులతో పంచుకున్నారు. పాత స్నేహితులతో కలిసి ఫోటోలు దిగుతూ, విందు భోజనం చేస్తూ రోజంతా ఉత్సాహంగా గడిపారు. మళ్లీ ఇలాగే కలుస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ వీడ్కోలు పలికారు.
