మహబూబ్‌నగర్‌లో విషాదం..
మహబూబ్‌నగర్‌లో విషాదం..
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలకొండ బైపాస్‌లోని శివాజీ సర్కిల్ సమీపంలో కారు–స్పోర్ట్స్ బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలో జరిగిన ఓ దావత్‌కు హాజరైన హదరాబాద్ యువకులు స్పోర్ట్స్ బైక్‌లతో బైపాస్ పై రేసింగ్‌కు దిగినట్లు తెలుస్తోంది. అతివేగంగా దూసుకొచ్చిన బైక్ పాలకొండ యూటర్న్ వద్ద కారు ఢీ కొనడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదే సమయంలో కారులో ఉన్న వారు పిస్తా హౌస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. ఢీకొన్న వేగానికి వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు, ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

