Fuel Crisis India | తక్కువ ధరలకే ఇంధన విక్రయాలు

Fuel Crisis India | తక్కువ ధరలకే ఇంధన విక్రయాలు

Fuel Crisis India | ముంబై: ప్రపంచ ఇంధన షాక్ నుండి వినియోగదారులను కాపాడే క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు సుమారు రూ. 1,600 కోట్ల నుండి రూ. 1,700 కోట్ల వరకు నష్టాన్ని భరిస్తున్నాయి. 10 వారాల్లో రూ. 1 లక్ష కోట్లకు పైగా నష్టాలను చవిచూసినట్లు కథనాలు వెలువడ్డాయి.

పెరుగుతున్న నష్టాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులుగా మారకుండా ఆ సంస్థలు ఈ భారాన్ని ఇంకెంత కాలం భరించగలవనే ప్రశ్న తలెత్తుతోంది. 10 వారాల క్రితం పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పుడు చాలా దేశాలు రేషనింగ్ విధించడం, ధరలను పెంచడం చేశాయి. అయితే ఇతర దేశాలలోని ఆయిల్ సంస్థల వలే కాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లు ఖర్చు కంటే తక్కువ ధరలకే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ)లను సరఫరా చేస్తున్నాయి.

దీంతో ఈ మూడు సంస్థలు ఇప్పుడు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలపై రికార్డు స్థాయిలో నష్టాలను చవిచూస్తున్నాయి. ముడి చమురు ధరలు 50 శాతం పెరిగినప్పటికీ పెట్రోలు, డీజిళ్లను రెండేళ్ల నాటి ధరలకే విక్రయిస్తున్నాయి. మార్చిలో గృహ వినియోగ ఎల్పీజీ ధరలను సిలిండర్‌కు రూ. 60 పెంచినప్పటికీ, అది వాస్తవ వ్యయం కంటే చాలా తక్కువగానే ఉంది.

ముడి చమురు కొనుగోలు చేయడానికి, దానిని ఇంధనంగా మార్చడం, మౌలిక సదుపాయాల నిర్మాణం, ఆ ఉత్పత్తిని వినియోగదారునికి చేరవేసేందుకు అవసరమైన నెట్వర్క్‌లను ఏర్పాటు చేయడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాయి. 10 వారాల పాటు భారత్ మార్కెట్‌ను కాపాడిన తరువాత దాని మూల్యం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని ఓఎంసీల వర్గాలు అంటున్నాయి.

ముడి చమురు కొనుగోళ్లకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కోసం కంపెనీలు మరింతగా రుణాలు తీసుకోవలసి రావచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరల పెరుగుదల ఎక్కువ కాలం పాటు కొనసాగితే చమురు మార్కెటింగ్ కంపెనీలకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, మూలధన వ్యయాలపై సమీక్షించుకోవలసి వస్తుంది. అయితే రిఫైనింగ్ విస్తరణ, ఇంధన భద్రతా మౌలిక సదుపాయాలు, ఇథనాల్ మిశ్రమం, జీవ ఇంధనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలలో వ్యూహాత్మక పెట్టుబడులు పెంచాలని ప్రభుత్వం భావిస్తుండటం, ప్రభుత్వం నుండి సహకారం అందవచ్చనే అంచనాలతో ముందుకు సాగుతాయని భావిస్తున్నారు.

పశ్చిమాసియా సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ సహా పలు దేశాలు పెట్రోలు, డీజిల్ ధరలను 30 శాతం వరకు పెంచాయి. ఈ యుద్ధం కారణంగా భారత్ దిగుమతి చేసుకునే 40 శాతం ముడి చమురు, 90 శాతం ఎల్పీజీ, 65 శాతం సహజ వాయువులకు అంతరాయం కలిగింది. అయినప్పటికీ ధరలను పెంచలేదు.

భయాందోళనలతో ప్రజలు అధికంగా కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ పెరిగినప్పుడూ సైతం ఈ మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలు సరఫరాను నిరంతరం కొనసాగించాయి. ఇంధన వ్యయ భారాన్ని పాక్షికంగా భరించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకంలో కోతలు విధించింది. పెట్రోలుపై ప్రత్యేక అదనపు సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కు తగ్గించగా, డీజిల్‌పై రూ.10 నుండి సున్నాకు తగ్గించారు. ప్రభుత్వానికి నెలకు రూ.14,000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఓఎంసీలు రిటైల్ ధరలను యథాతథంగా ఉంచడంతో 10 వారాల్లోనే వాటి వసూళ్లలో లోటు రూ.1 లక్ష కోట్లను దాటింది.