దక్షిణ భారత రవాణాలో గేమ్ ఛేంజర్
దక్షిణ భారత రవాణాలో గేమ్ ఛేంజర్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: భారత జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా అధికారిక అలైన్‌మెంట్ ప్రణాళికను విడుదల చేసింది. దీంతో చెన్నై-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అమలు దిశగా కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా తమిళనాడు రాజధాని చెన్నై, కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నాలుగున్నర గంటలకు పైగా పడుతున్న ప్రయాణం, బుల్లెట్ ట్రైన్ ద్వారా కేవలం గంటా 13 నిమిషాల్లో పూర్తికానుండటం విశేషం.
సుమారు 306 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ హైస్పీడ్ కారిడార్లో గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో, ఆపరేషనల్‌గా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ బుల్లెట్ రైలు మార్గంలో మొత్తం ఎనిమిది ప్రధాన స్టేషన్లను ప్రతిపాదించారు. చెన్నై సెంట్రల్, పూనమల్లే, పరందూర్, చిత్తూరు, కోలార్, కోడిహಳ್ಳಿ, వైట్‌ఫీల్డ్, బయప్పనహಳ್ಳಿ స్టేషన్లు ఇందులో భాగమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఒక స్టాప్‌ను ప్రతిపాదించారు.
చిత్తూరు జిల్లాకు అభివృద్ధి అవకాశాలు
చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్లో చిత్తూరు జిల్లా కీలక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గేట్‌వేగా ఉన్న చిత్తూరు జిల్లా, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో దక్షిణ భారత ఆర్థిక, వాణిజ్య రంగాల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
ముఖ్యంగా చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు భారీ అవకాశాలను తెరచనుంది. బెంగళూరు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది జిల్లా ప్రజలకు ఈ హైస్పీడ్ కనెక్టివిటీ ఎంతో ఉపయోగపడనుంది. అలాగే చెన్నై పరిశ్రమలు, బెంగళూరు ఐటీ కారిడార్ మధ్య చిత్తూరు జిల్లా ప్రధాన ట్రాన్సిట్ హబ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, మామిడి, టమోటా, పూల సాగు వంటి రంగాలకు వేగవంతమైన రవాణా సదుపాయం లభించనుంది.
పలమనేరు వద్ద అండర్‌గ్రౌండ్ మార్గం
ఈ ప్రాజెక్టులో పలమనేరు ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం దక్కనున్నట్లు తెలుస్తోంది. పలమనేరు ప్రాంతం కొండలు, అటవీ ప్రాంతాలు, భౌగోళిక సున్నిత పరిస్థితులతో కూడి ఉండటంతో అక్కడ కొంత భాగాన్ని అండర్‌గ్రౌండ్ సొరంగ మార్గంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పర్వత ప్రాంతాల్లో భారీ వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్‌కు సురక్షితమైన సూటి మార్గం కల్పించేందుకు భూగర్భ మార్గం అనుకూలంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అటవీ ప్రాంతాలకు తక్కువ నష్టం కలగడం, భూసేకరణ సమస్యలు తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. పలమనేరు ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ కారిడార్ నిర్మాణం జరిగితే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, పర్యాటక, వాణిజ్య రంగాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. తిరుపతి, బెంగళూరు, చెన్నై మధ్య ప్రయాణించే భక్తులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులకు ఈ మార్గం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
ఎలివేటెడ్, అండర్‌గ్రౌండ్ నిర్మాణం
మొత్తం ప్రాజెక్టులో సుమారు 90 శాతం భాగాన్ని ఎలివేటెడ్ కారిడార్ రూపంలో నిర్మించనున్నారు. భారీ కాంక్రీట్ పిల్లర్లపై ప్రత్యేక వయాడక్టులను నిర్మించి రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు, భూసేకరణ ఇబ్బందులను తగ్గించేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నారు.
మరోవైపు సుమారు 10 శాతం భాగం అండర్‌గ్రౌండ్ మార్గంగా ఉండనుంది. ముఖ్యంగా బెంగళూరు నగర పరిధిలో దాదాపు 15.94 కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగ మార్గం ప్రతిపాదించారు.
పరందూర్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ
చెన్నై సమీపంలోని పరందూరులో నిర్మించనున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ బుల్లెట్ ట్రైన్ నేరుగా అనుసంధానం కానుంది. దీంతో బెంగళూరు నుంచి చెన్నై విమానాశ్రయ ప్రాంతానికి అత్యంత వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది.
దక్షిణ భారత రవాణా వ్యవస్థలో మల్టీ మోడల్ కనెక్టివిటీకి కొత్త దిశను చూపనుంది. ప్రస్తుతం సర్వేలు, సాంకేతిక అధ్యయనాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించి పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చెన్నై-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు రావడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఈ హైస్పీడ్ కారిడార్లో కీలక కేంద్రంగా ఎదిగి రాష్ట్రానికి ప్రధాన వాణిజ్య ద్వారంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
