Digital Transformation | దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలే మూల స్తంభాలు
Digital Transformation | దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలే మూల స్తంభాలు
Digital Transformation | రుణాల కొరతతో చిన్న పరిశ్రమలకు పెరుగుతున్న ఇబ్బందులు
మహిళల సాధికారితకు ఎంఎస్ఎంఈల కీలక పాత్ర
డిజిటలీకరణ, ఏఐతో చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు
సాంకేతికత అందిపుచ్చుకుంటేనే వ్యాపార విస్తరణ
Digital Transformation | దేశంలో ఉద్యోగ కల్పన, ప్రాంతీయ అభివృద్ధిలో పాటు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు ఈనాడు అగ్ర భాగాన నిలిచాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 30 శాతం, ఎగుమతుల్లో 45 శాతం వాటా ఎంఎస్ఎంఈల నుంచే సమకూరుతోంది. ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాల మాదిరి పని చేస్తున్న చిన్న పరిశ్రమల అభివృద్ధికి, విస్తరణకు, సాంకేతికతకు, డిజిటలీకరణకు భారత ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలను అందిస్తోంది.
మన ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు పెద్ద దన్నుగా నిలుస్తున్నాయి. దేశీయ తయారీ రంగంలో 35 శాతం వాటాతో అగ్రగామిగా నిలిచాయి. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ఎంఈలేనని చెప్పక తప్పదు. దేశంలో 7.47 కోట్ల ఎంఎస్ఎంఈలు దాదాపు 33 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ రంగం అభివృద్ధికి కేంద్రం ముద్ర యోజన, పీఎం ఉద్యోగ కల్పనా కార్యక్రమం, క్రెడిట్ గ్యారంటీ పథకం వంటివి ఎన్నో తీసుకొచ్చింది. అంతేగాక ఈ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని 2026-27 బడ్జెట్‌లోనూ ప్రత్యేక వ్యూహాలను ప్రతిపాదించింది. ప్రధానంగా వాటి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు పదివేల కోట్ల రూపాయల నిధిని కూడా ఏర్పరిచింది.
ఏ సంస్థకైనా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మూలధనం అవసరం. దీనికిగాను ఎటువంటి పూచీకత్తి లేకుండా మంజూరు చేసే రుణ పరిమితిని ఆర్బీఐ తాజాగా 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచింది. దేశం మొత్తం పరిశ్రమలో 90 శాతానికి పైగా చిన్న పరిశ్రమలే ఉన్నాయి. వీటిలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి. దాదాపు 20 శాతం మంది మహిళలు వారి సాధికారితకు బాటలు వేస్తున్నారు.
అయితే ఈ పరిశ్రమలకు బ్యాంకులు, రుణ సంస్థల నుంచి రుణ పరిమితి సరిగా అందట్లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సరైన మద్దతు లోపించడమే దీనికి కారణం. నీతి అయోగ్ నివేదిక ప్రకారం 2020-24 మధ్య సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం 14 శాతం నుంచి 20 శాతానికి, అలాగే మధ్య స్థాయి పరిశ్రమలకు నాలుగు శాతం నుంచి తొమ్మిది శాతానికి పెరిగింది. కానీ అదే సమయంలో దేశీయంగా 19 శాతం ఎంఎస్ఎంఈలకు మాత్రమే రుణాలు అందుతున్నాయి.
కారణం బ్యాంకులు రుణాలు అందించే సమయంలో కఠిన నియమ నిబంధనలతో పాటు వివిధ రకాలైన దరఖాస్తు ఫారాలతో రుణగ్రస్తులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చుక్కలనంటుతున్న ముడి సరుకుల ధరలతో ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు కొనుగోలుదారులు కూడా పలు ఇబ్బందులతో సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఇటీవల ఆర్థిక సర్వేలో 8 లక్షల కోట్ల రూపాయల వరకు బకాయిలు అలానే పేరుకుపోయాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది.
ఎంఎస్ఎంఈలకు నిధుల లభ్యత ఉండేలా చూసేందుకు 20 వేల కోట్ల రూపాయల పరిమితకాల క్రెడిట్ గ్యారెంటీ పథకానికి (సీజీఎస్ఎంఎఫ్ఎస్ఐ 2.0) ఆమోదం తెలిపింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)లకు, ఎంఎఫ్ఐలకు బ్యాంకులు సభ్య సంస్థలు అందించే రుణాలకు ఈ ఏడాది జూన్ వరకు క్రెడిట్ గ్యారెంటీని ఈ పథకం ఇస్తోందని నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ తెలిపింది.
అంతేగాక ఎంఎస్ఎంఈలు మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఊతమిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,63,92,782 ఎంఎస్ఎంఈలు ఉంటే వాటిలో 59 లక్షలకు పైగా సంస్థలు మహిళల ఆధ్వర్యంలోనివే. ఎంఎస్ఎంఈల ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి చివరినాటికి సుమారు 2.13 కోట్ల మంది మహిళలు ఉపాధి పొందుతుండటం విశేషం. దేశంలో అత్యధికంగా మహిళలకు ఉత్తరప్రదేశ్‌లో 28,68,302తో, అత్యల్పంగా మధ్యప్రదేశ్‌లో 10,07,995 మంది మహిళలకు ఉపాధి దొరుకుతున్నట్లు లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. అలాగే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌లో 11,73,097, తెలంగాణలో 18,62,850 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.
డిజిటలీకరణ:
మన ఎంఎస్ఎంఈలు బలపడితే ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రస్తుతం డిజిటలీకరణ, కృత్రిమ మేధ (ఏఐ) పెద్ద పెద్ద పరిశ్రమలకే పరిమితమైంది. చిన్న పరిశ్రమల రంగంలో కూడా కాలానుగుణంగా డిజిటలీకరణను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతో ఏర్పడింది. ఇది మంచి అవకాశంగా భావించాలి.
ఇప్పటిదాకా ఏదో నెట్టుకుపోతున్నాము కదా అన్నట్లుగా వ్యాపారస్తులు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంగంలో డిజిటలైజేషన్ మార్పు ఎంత త్వరగా విస్తరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంత వేగంగా ముందుకు సాగుతుంది. ఈ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు ఒక దృఢమైన స్వదేశీ పునాదిని ఏర్పరచగలుగుతాం. ఆర్థిక వికాసం కోసం అంతర్జాతీయ వాణిజ్యంపై ఆధారపడే అవసరాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
చాలా చోట్ల చిన్న వ్యాపారాలు పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయి. అంటే వ్యాపార లావాదేవీలను పుస్తకాల ద్వారానే నిర్వహిస్తున్నారు. నేడు వేగవంతమైన మార్పులతో, తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. లేనిపక్షంలో వెనుకబడిపోయి వ్యాపారం ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతుంది.
డిజిటలీకరణ తరువాత వచ్చే దశ కృత్రిమ మేధ (ఏఐ). డేటా సేకరణ మొదటి అడుగు అయితే, ఆ డేటాను అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడేదే కృత్రిమ మేధ. వ్యాపార రంగం భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను తెలియజేస్తూ ఎలా ముందుకు వెళ్లాలో నిర్దేశిస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే వారికి ఈ నైపుణ్యంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రగతి పథం వైపు నడిపించాలి.
ఈ రంగానికి తగ్గట్లుగా సులభమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలి. స్థానిక భాషలో సులభతరంగా అర్థమయ్యే పరిష్కారాలు అన్వేషించాలి. అంతేగాక ఈ-కామర్స్ ద్వారా ఎగుమతులకు కొత్త ద్వారాలు వెతకాలి.
గోపాలుని రాధాకృష్ణ
9885390232
