కళాకారులందరికి రూ. 5000 పెన్షన్ ఇవ్వాలి..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కేంద్రంలోని కేఆర్ భవన్ లో తెలంగాణ ప్రజానాట్యమండలి మండల 3 వ మహాసభ బోడ సోమనర్సయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ప్రజానాట్య మండల జిల్లా అధ్యక్షులు బుషిపాక నరసింహ హాజరై మాట్లాడుతూ కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం , ప్రజా చైతన్యం కోసమని మొట్టమొదట నినదించింది తెలంగాణ ప్రజానాట్య మండలి అన్నారు. నాటి స్వాతంత్ర ఉద్యమంలో వీరోచిత తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లా చెదరని విప్లవ ప్రచండ బందగీ రక్తం చిందిన పరమ పునీత మైన క్షేత్రం చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన త్యాగాల పుణ్యభూమి మనది అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు గోసి గొంగడి కాలి గజ్జలతో తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు ధూంధాం ఆటపాటలతో పాటు వివిధ కళారూపాలతో ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేశారన్నారు. ఈనెల 20 న ఆలేరులో జరుగు తెలంగాణ ప్రజానాట్యమండలి యాదాద్రి భువనగిరి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వృత్తి కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని , వృద్ధ కళాకారులకు రూ.2 వేల నుండి రూ.5000 పెన్షన్ ఇవ్వాలని, కళాకారులకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని , కళాకారులు అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. తదనంతరం మండల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది.

నూతన కమిటీ అధ్యక్షులు గా బోడ సోమనర్సయ్య, ఉపాధ్యక్షులుగా మొగుల్ల శేఖర్ రెడ్డి ,పులకరంమల్లేష్, ప్రధాన కార్యదర్శి. గొలుసులు యాదగిరి ,సహాయ కార్యదర్శిలుగా ఎర్ర బాబు, ఎర్రబెల్లి వెంకటమ్మ , తొంట పెద్ద నరసమ్మ , బోడ నిర్మల, బోడ లక్ష్మీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనేపు వెంకట్, గీత పని వారల సంఘం జిల్లా అధ్యక్షుడు చాపల అంజయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి బోయిని ఉప్పలయ్య , బీసీ సంఘం మండల అధ్యక్షుడు పెండం వెంకటేశ్వర్లు, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు తోంట మాధవి ,బోడ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.