ఆకస్మికంగా కలుసుకున్న రాజకీయ ప్రత్యర్థులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో అనుకోకుండా రాజకీయం ప్రత్యర్థులు శనివారం కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ లో జరిగిన వివాహ వేడుకలలో పాల్గొని కారులో వెళుతుండగా అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారులో ఎదురుగా రావడంతో ఒకరిని ఒకరు చూసుకుని ఇద్దరు తమ కార్లను ఆపి కిందకు దిగి ఆప్యాయంగా పలకరించుకున్నారు.

వడ్ల కొనుగోలు వేగంగా జరగడం లేదని, మండుటెండలో రైతులు కల్లాలలో ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన రాజగోపాల్ రెడ్డి ఈసారి వర్షాలు బాగా కురవడం వల్ల వరి ధాన్యం పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని, అందువల్లనే కల్లాలలో ధాన్యం నిల్వలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, అయినప్పటికీ అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ఇంకా వేగంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇద్దరు రాజకీయ ప్రత్యార్థుల మధ్య జరిగిన ఆకస్మిక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Leave a Reply