విద్యార్థుల సంక్షేమానికి ప్రోత్సాహం

విద్యార్థుల సంక్షేమానికి ప్రోత్సాహం

-జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్

నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభ: నాగర్ కర్నూల్ ఐడిఓసి కార్యాలయ ఆవరణలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే కుమ్మెర, పెద్దాపూర్, గన్యాగుల, మంతటి, గగ్గలపల్లి, నార్లాపూర్, పాఠశాలల విద్యార్థులకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ప్రత్యేక చొరవతో, జిందాల్ స్టీల్ పవర్ సంస్థ సౌజన్యంతో సీఎస్ఆర్ నిధుల ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసిన 130 మంది విద్యార్థులు, విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీని కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి లతో కలిసి ఎంపీ డాక్టర్ మల్లు రవి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముందుగా కొమ్మెర గ్రామ విద్యార్థులు 48 మంది విద్యార్థులకు, ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కలిసి విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు విద్యను కొనసాగించడంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఒకటి రవాణా సౌకర్యం అని తెలిపారు.

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు, సైకిళ్లు అందించడం ద్వారా విద్యార్థులు పాఠశాలకు సమయానికి హాజరు కావడంతో పాటు, వారి విద్యపై ఆసక్తి మరింత పెరుగుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని అందుకు కృషి చేసిన విద్యార్థులకు అధికారులకు ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం సైతం అందించేందుకు కసరతులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

జిందాల్ స్టీల్ పవర్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా సమాజానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎంపీ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సంస్థ ఇలాంటి కార్యక్రమాలను విస్తరించాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటితో పాటు ప్రైవేట్ సంస్థల సహకారం ఉంటే విద్యా రంగం మరింత బలపడుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సైకిళ్లు అందడం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు, చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఎక్కువవుతాయని, విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని ప్రతిరోజు పాఠశాలకు హాజరుకావాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. మొట్టమొదటిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్థులకు అందజేయడం చాలా సంతోషించదగ్గ విషయమని ఆయన ఎంపీకి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8, 9 ,10,వ తరగతి విద్యార్థులకు షూ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సీఎస్ ఆర్ నిధులతో ఏర్పాటు చేయాలని ఎంపీని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించిన ఎంపీ సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు అవసరమైన షూను అందజేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎంపీ తెలిపారు. సైకిళ్ల ద్వారా విద్యార్థులు సులభంగా పాఠశాలకు వెళ్లగలరని, తద్వారా వారి చదువు అంతరాయం లేకుండా కొనసాగుతుందని గ్రామీణ విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించే దిశగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సహాయం అందించిన ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిందాల్ స్టీల్ పవర్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. సైకిళ్లు తమ చదువుకు ఎంతో ఉపయోగపడతాయని, ఇకపై మరింత కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తామని విద్యార్థులు తెలిపారు. నోడల్ అధికారి కురుమయ్య, జింగల్ సంస్థ ప్రతినిధి రెడ్డి నాయక్ ,జిల్లా విద్యాశాఖ అధికారులు షర్ఫుద్దీన్, వెంకటేశ్వర్లు శెట్టి , పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.