స్వచ్ఛ నరసన్నపేటే ధ్యేయం
స్వచ్ఛ నరసన్నపేటే ధ్యేయం
- జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
నరసన్నపేట, ఆంధ్రప్రభ: జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన నరసన్నపేటను ఆదర్శవంతమైన స్వచ్ఛ నరసన్నపేటగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయమే నరసన్నపేట చేరుకున్న కలెక్టర్, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో జరుగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు. పారిశుధ్య నిర్వహణలో రాజీ పడకూడదని, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి లక్ష్యాన్ని పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సమయం ఆసన్నమైన తరుణంలో, నరసన్నపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పట్టణంలోని 20 వార్డులకు గానూ ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ అధికారులను నియమించారు. వీరిలో 20 మంది ఎంపీడీఓలు, 20 మంది డిప్యూటీ ఎంపీడీఓలు, 50 మంది పంచాయతీ కార్యదర్శులు, 10 మంది తహసీల్దార్లతో పాటు భారీగా రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వార్డులోనూ పారిశుధ్య పనుల కోసం ప్రత్యేకంగా 20 మంది కార్మికులను, ట్రాక్టర్లను కేటాయించి పారిశుధ్య విప్లవానికి శ్రీకారం చుట్టారు.
కలెక్టర్ తన పర్యటనలో భాగంగా సత్యవరం కూడలి నుండి పెద్దపేట వరకు కాలినడకన వెళ్లి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలోని వ్యాపారులతో మాట్లాడుతూ.. షాపుల ముందు చెత్త వేయకూడదని, రోడ్లపైకి నిర్మాణ సామాగ్రి, ఇసుక రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూనే, పట్టణ పరిశుభ్రతలో వ్యాపారులు భాగస్వాములు కావాలని కోరారు. మెయిన్ రోడ్డుపై ఎక్కడా చెత్త కనిపించకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దుకాణదారులదేనని స్పష్టం చేశారు.
అనంతరం పచూరి కాలనీలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం చేపట్టిన ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని, తద్వారా నరసన్నపేటను ఒక మోడల్ పట్టణంగా నిలబెట్టాలని అధికారులను ఆదేశించారు.
