రైతుల రాస్తారోకోతో అధికారులకు గట్టి హెచ్చరిక..

రైతుల రాస్తారోకోతో అధికారులకు గట్టి హెచ్చరిక..
- కొనుగోలు కేంద్రం ప్రారంభానికి హామీ
దిలావర్‌పూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే తమకు దిక్కెవరు అంటూ గుండంపెల్లి రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం గుండంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రైతులు రోడ్డెక్కి ధర్నా, రాస్తారోకో నిర్వహిస్తూ నిరసన తెలిపారు.
ధర్నా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న ఆర్డీవో రత్నకళ్యాణితో గుండంపల్లి సర్పంచ్ రమణారెడ్డి ఇతర రైతులతో కలిసి మాట్లాడారు. ఫిబ్రవరిలో కోసిన పంటను ఇప్పటివరకు కొనుగోలు చేయకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
“మార్చి నుంచి ఇప్పటివరకు పంటను కొనకపోతే రైతులకు దిక్కెవరు?” అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. వర్షాలు కురిస్తే పంట నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలను విన్న ఆర్డీవో వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. కొన్ని గంటల పాటు సాగిన రాస్తారోకో కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు.
