సీపీఐ ఆందోళనకు మద్దతు తెలిపిన ఎంపి మల్లురవి

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ–ఎన్‌డీఏ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను మోసం చేశారని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత మరియు ధరల పెంపుపై నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఐ శ్రేణులు ఖాళీ గ్యాస్ సిలిండర్లకు వరి తాళ్లు కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఎం.డి ఫయాజ్‌తో కలిసి మాట్లాడిన ఎంపీ మల్లు రవి, ఎన్నికల సమయంలో ధరలు పెంచమని చెప్పకుండా ఓట్లు సాధించుకుని, తరువాత వెంటనే గ్యాస్ ధరలు పెంచడం మోసపూరిత చర్య అని విమర్శించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ధరల పెంపు గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, చివరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. దేశంలో డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ కొరతను వెంటనే నివారించాలని, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఐ చేస్తున్న ఆందోళనలకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని, ధరలు తగ్గించే వరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్. ఆనంద్, జిల్లా పార్టీ సమితి సభ్యులు మర్యాద వెంకటయ్య, బిజ్జ శ్రీనివాస్, బి. ప్రేమ్ కుమార్, మారేడు శివశంకర్, బండి లక్ష్మీపతి, తప్పెట కిరణ్ కుమార్, బండి వెంకటమ్మ, మండల నాయకులు కొత్త రామస్వామి, వంకేశ్వరం శ్రీనివాసులు, బాలపీర్, వెంకటస్వామి, సిద్దేశి విజయ్, బి. శివశంకర్, బి. కురుమయ్య, సీతయ్య, హుస్సేన్, అంజి, ఎండి నియాజ్ తదితరులు పాల్గొన్నారు.