దళిత క్రైస్తవుల హక్కులపై కుట్రలు సహించం

దళిత క్రైస్తవుల హక్కులపై కుట్రలు సహించం

  • రిజర్వేషన్లకు మతంతో సంబంధం లేదు
  • మతం రాజ్యాంగం ఇచ్చిన హక్కు
  • రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులు, రిజర్వేషన్లు కాపాడగలం
  • దళిత క్రైస్తవుల హక్కుల కోసం చివరి వరకు పోరాడుతా
  • తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరోః దళిత క్రైస్తవుల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని అందరం సమిష్టిగా పోరాడాల్సిన సమయం వచ్చిందంటూ తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియన్ సేవా సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దళిత క్రైస్తవుల హక్కులు, ఎస్సీ రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణ అంశాలపై భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు.

ఇటీవల దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయాలనే చర్చల వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. సుమారు 40 సంవత్సరాల క్రితం గుంటూరు మున్సిపల్ ఎన్నికల సందర్భాన్ని ప్రస్తావించిన ఆయన, అప్పట్లో దళిత క్రైస్తవుల సామాజిక, రాజకీయ బలం ఎంత ప్రభావవంతంగా ఉండేదో గుర్తుచేశారు. గుంటూరు మున్సిపల్ చైర్మన్ పదవికి జనరల్ సీట్లో దళిత క్రైస్తవ నాయకుడిని నిలబెట్టే స్థాయిలో ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఉండేదని చెప్పారు. ప్రస్తుతం “ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే” అనే ప్రచారం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని, దీని వెనుక అసలు లక్ష్యం ఎస్సీ వర్గాల రిజర్వేషన్లను బలహీనపరచడమేనని ఆరోపించారు.

నేరుగా రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పే ధైర్యం లేక దొంగదారిలో దళితులపై మత ముద్ర వేసి హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28 ద్వారా ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ హక్కుగా ఉందని గుర్తు చేశారు. ఎవరైనా చర్చి, దేవాలయం, మసీదు లేదా ఇతర ప్రార్థనా స్థలాలకు వెళ్లడం వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని స్పష్టం చేశారు. తన కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ఒకవైపు హిందూ సంప్రదాయాలు, మరోవైపు క్రైస్తవ మత బోధనల మధ్య పెరిగానని, తర్వాత సామాజిక చైతన్యంతో విభిన్న ఆలోచనలను అధ్యయనం చేశానని చెప్పారు.

సమాజాన్ని అర్థం చేసుకున్న తర్వాత రాజ్యాంగమే తనకు మార్గదర్శకమైందని పేర్కొన్నారు. తన తిరువూరు నియోజకవర్గంలో దాదాపు 70 వేల మంది దళిత క్రైస్తవులు ఉన్నారని, వారి హక్కుల విషయంలో తాను మౌనంగా ఉండలేనని స్పష్టం చేశారు. దళితులకు వచ్చిన రిజర్వేషన్లు మతం వల్ల కాదని, కుల వివక్ష, అంటరానితనం, సామాజిక వెనుకబాటుతనం కారణంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులని పేర్కొన్నారు.

ఇటీవల రాజ్యాంగ స్ఫూర్తిని బలహీనపరిచే మార్పులు నిశ్శబ్దంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనం పాటించే నాయకుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నిలబడి మాట్లాడటమే నిజమైన ఉద్యమమని, సోషల్ మీడియా సహా ప్రతి వేదికను హక్కుల పరిరక్షణకు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. “రాజ్యాంగో రక్షతే రక్షితః… మనం రాజ్యాంగాన్ని కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది” అని పేర్కొంటూ దళిత క్రైస్తవుల హక్కుల కోసం జరిగే ప్రతి పోరాటంలో తాను ముందుంటానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు.