హెచ్‌సీఏ టీజీ20 లీగ్‌ వెంటనే నిలిపేయాలి

హెచ్‌సీఏ టీజీ20 లీగ్‌ వెంటనే నిలిపేయాలి

  • జిల్లా టీసీఏ హెచ్చరిక

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ20 / ప్రీమియర్ లీగ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ , సీఈఓలకు అత్యవసర అలర్ట్ నోటీసు జారీ చేసిందనీ జిల్లా టిసిఏ సంఘం బాధ్యులు నయీం ఆకుల ప్రవీణ్ తెలిపారు. లీగ్‌ను తక్షణమే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. హెచ్‌సీఏ రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని టీసీఏ పేర్కొంది. జిల్లాల స్థాయిలో అవసరమైన నిర్మాణం, కమిటీలు, మౌలిక సదుపాయాలు, ఆటగాళ్ల నమోదు వ్యవస్థ హెచ్‌సీఏ వద్ద లేవని విమర్శించింది.

గత 80 సంవత్సరాలుగా తెలంగాణ జిల్లాల్లో హెచ్‌సీఏ గణనీయమైన అభివృద్ధి చేయలేదని ఆరోపించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం అవసరమైన జిల్లా కమిటీలు, ప్లేయర్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, టోర్నమెంట్లు, సెలెక్షన్స్, కోచింగ్ మరియు మ్యాచ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్‌వర్క్ వంటి పూర్తి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి గ్రాస్‌రూట్ క్రికెట్ వ్యవస్థను నిరంతరం నిర్వహిస్తున్న ఏకైక సంస్థ టీసీఏ మాత్రమేనని పేర్కొంది. టీసీఏతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా హెచ్‌సీఏ లోగో ఆవిష్కరణ, ఫ్రాంచైజీల కోసం ఈఓఐ ప్రక్రియ ప్రారంభం, గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటన వంటి చర్యలు తీసుకోవడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని టీసీఏ కమిటీ తెలిపింది.

బొంబాయి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించింది. బీసీసీఐ రూల్స్ 28, 30, 31 ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా టీ20 టోర్నమెంట్ నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాగే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో మరియు ముందు/తర్వాత 15 రోజుల బఫర్ పీరియడ్‌లో రాష్ట్ర లీగ్‌లు నిర్వహించకూడదనే నిబంధనను హెచ్‌సీఏ ఉల్లంఘిస్తోందని తెలిపింది.

అనుమతి లేని టోర్నమెంట్లలో పాల్గొంటే ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు క్రమశిక్షణ చర్యలకు గురయ్యే ప్రమాదం ఉందని, యువ క్రీడాకారుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధి చేసిన గ్రాస్‌రూట్ క్రికెట్ వ్యవస్థను అక్రమంగా ఆక్రమించుకోవడమే హెచ్‌సీఏ లక్ష్యమని టీసీఏ ఆరోపించింది. తెలంగాణ జిల్లాల్లోకి హెచ్‌సీఏ చొరబడే ప్రయత్నాలు చేస్తే ఇప్పటికే ఉన్న కేసులతో పాటు మరిన్ని ఫిర్యాదులు చేసి కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
డిమాండ్లు:
హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ను తక్షణమే నిలిపివేయాలి. తెలంగాణ పేరుతో నిర్వహించే ఏ లీగ్ అయినా పారదర్శకంగా, చట్టబద్ధంగా టీసీఏ కమిటీలు మరియు జిల్లా క్రికెటర్లకు సరైన ప్రాతినిధ్యంతో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించాలనీ డిమాండ్ చేశారు.