కొత్తగూడెం చెరువును ధ్వంసం వార్తకు స్పందన
కొత్తగూడెం చెరువును ధ్వంసం వార్తకు స్పందన
- గత ఐదు సంవత్సరాల నుండి పట్టించుకోని వైనం
- అందిన కాడికి దండుకున్న అక్రమార్కులు
- తొవ్వినోనికి తవ్వినంత కాసుల మట్టి
- గ్రామస్తుల ఆరోపణలు
- అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ: కొత్తగూడెం గ్రామంలో చెరువులో అక్రమంగా మట్టి తవ్వకంపై ఆంధ్రప్రభలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు గ్రామానికి ముఖ్యమైన నీటి వనరు అని ఈ విధమైన అక్రమ చర్యలు భవిష్యత్తులో నీటి సమస్యలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో, ఇరిగేషన్ శాఖ అధికారులు గ్రామ సెక్రటరీతో కలిసి చెరువు పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు.
అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, మట్టి తవ్వకానికి ఉపయోగించిన మార్గాలు, వాహనాల ఆనవాళ్లు చెరువు నిర్మాణానికి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ.. అక్రమంగా మట్టి తవ్వకానికి పాల్పడిన వారిని గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చెరువు వద్ద పర్యవేక్షణను పెంచుతామని తెలిపారు.
గ్రామస్తులు కూడా చెరువు పరిరక్షణకు సహకరించాలని, ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చెరువులు గ్రామాల అభివృద్ధికి, వ్యవసాయానికి కీలకమైనవని, వాటి సంరక్షణ అందరి బాధ్యత అన్నారు.ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

