సేంద్రియ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ

సేంద్రియ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. సేంద్రియ సాగు చేస్తున్న రైతులకు సరైన మార్కెట్ కల్పిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘టీజీ ఆర్గానిక్స్’ మొబైల్ యాప్‌ను రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.

రైతు నుంచి వినియోగదారునికి నేరుగా ఉత్పత్తులు చేరే విధంగా రూపొందించిన ఈ యాప్, సేంద్రియ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల ఆహార నాణ్యతపై సందేహాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సహజ వనరులతో, సేంద్రియ ఎరువులతో పండించే పంటలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. అయితే మార్కెటింగ్ లోపాలు, నాణ్యతపై స్పష్టత లేకపోవడం రైతులకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యలకు పరిష్కారంగా ‘టీజీ ఆర్గానిక్స్’ యాప్‌ను తీసుకువస్తున్నారు.

ఈ యాప్‌ను వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి తమకు కావలసిన పంటలు, ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం రైతుల వివరాలు చూసి వారిని నేరుగా సంప్రదించి కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతుల సమాచారం ముందుగా కనిపించేలా సౌకర్యం కల్పించారు.

ఇప్పటికే 500 మంది రైతులు నమోదు
ప్రస్తుతం సుమారు 500 మంది సేంద్రియ రైతులు ఈ యాప్‌లో నమోదై ఉండగా, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుంది. 100కు పైగా ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. రైతుల మొబైల్ నంబర్లు, చిరునామాలు, లొకేషన్ వివరాలు కూడా యాప్‌లో లభిస్తాయి. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ అథారిటీ ద్వారా రైతుల వివరాలకు ఇందులో స్థానం కల్పించడం ప్రత్యేకత. అంతేకాకుండా, ఉత్పత్తుల ధరను నిర్ణయించే పూర్తి హక్కు రైతులకే ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక లాభం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వినియోగదారులు నేరుగా రైతుతో మాట్లాడి ధరపై చర్చించి కొనుగోలు చేయవచ్చు.

Leave a Reply