రైతాంగాన్ని మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వం
రైతాంగాన్ని మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వం
–మాజీ మంత్రి దయాకర్ రావు
తొర్రూరు, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అన్నిరకాలుగా మోసం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఈనెల 6న వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు సభకు జన సమీకరణపై శనివారం డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగు సంవత్సరాల కిందట అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క హామీనీ నెరవేర్చకుండా మోసగిస్తోందని ఆరోపించారు.
నాలుగేళ్ల కిందట మే 6న లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, చేసిన మోసాలను గుర్తు చేసేలా.. అదే రోజున ఈ నెల 6వ తేదీన వరంగల్ జిల్లాలో రైతన్నలతో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ప్రకటించిన కాంగ్రెస్ ఆ హామీలను తుంగలో తొక్కిందన్నారు. రుణమాఫీ సైతం పూర్తిస్థాయిలో చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోలులో తీవ్ర సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు.. కాంగ్రెస్ పాలనలో తిరిగి ప్రారంభమయ్యాయని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వసుమర్తి సీతారాములు, మాజీ జడ్పిటిసి మగలపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, కౌన్సిలర్లు కర్ని నాగరాజు, మాడుగుల భవానీ లత,ధరావత్ పద్మ, పేర్ల జంపన్న,భోజ్య తండా సర్పంచ్ మాలోత్ మౌనిక సంతోష్, నాయకులు చామకూరి ఐలయ్య, ఎండమనేని శ్రీనివాసరావు, కుర్ర శ్రీనివాస్, ప్రదీప్ రెడ్డి,కాలు నాయక్, మచ్చ సురేష్, భూసాని ఉప్పలయ్య, వీరారెడ్డి,ఆశయ్య, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
