59.5%AI jobs | ‘ఏఐ హబ్’గా.. భారత్

59.5% AI jobs | ‘ఏఐ హబ్’గా.. భారత్
59.5% AI jobs | ఐటీ రంగంలో కొలువుల జాతర !
ఏఐ స్టూడియో ఫ్లాట్ ఫామ్ పట్టు ఉంటే జాబ్ పక్కా
ఇప్పటికే ఈ ఏడాది 59 శాతం పెరిగిన నియామకాలు
హైదరాబాద్, విజయవాడలోనూ భారీగా ఉద్యోగాలు
హెల్త్‌కేర్, ఫైనాన్స్, రిటైల్ రంగాల్లో ఏఐ ఇంజనీర్ల వైపు చూపు
ప్రస్తుతం ఏఐ సాంకేతికత ఉన్ననిపుణులకే అవకాశాలు
కోడింగ్‌తో పాటు ఏఐపై శిక్షణ తీసుకుంటే భారీ జీతంతో జాబ్స్
59.5% AI jobs | న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు, మాంద్యం భయాలు ఉన్నాయని వింటున్న తరుణంలో.. కేవలం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) విభాగంలో నియామకాలు 59.5% పెరగడం నిరుద్యోగులు, టెక్ నిపుణులకు గొప్ప ఆశాకిరణం. ప్రపంచ దేశాలైన అమెరికా, యూకేను వెనక్కి నెట్టి భారత్ ఏఐ నైపుణ్యాల్లో అగ్రగామిగా ఎదుగుతుండడం విశేషం. లింక్డ్‌ఇన్ తాజా నివేదిక ప్రకారం.., భారత్ ప్రస్తుతం ప్రపంచ ‘ఏఐ హబ్’గా మారుతోంది.
గతేడాదితో పోలిస్తే ఏఐ ఇంజినీర్ల నియామకాల్లో 59.5% వృద్ధి నమోదు కావడం సామాన్యమైన విషయం కాదు. కేవలం బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ (51%) , విజయవాడ (45.5%) నగరాల్లో కూడా నియామకాలు పెరుగుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటోందని గణాంకాలు నిరూపిస్తున్నాయి.
భారీ డిమాండ్‌కు కారణాలు..

ప్రతి సంస్థ ఇప్పుడు తన ఉత్పాదకతను పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌ను ఒక అనివార్య సాధనంగా భావిస్తోంది. సాధారణ పనులను మనుషుల ప్రమేయం లేకుండా పూర్తి చేసే ‘ఏఐ ఏజెంట్స్’ వినియోగం పెరిగింది. దీనివల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గుతున్నాయి. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచే ఏఐ ప్రొడక్టివిటీ టూల్స్ అభివృద్ధి చేయడానికి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అజూర్ ఏఐ స్టూడియో వంటి ప్లాట్‌ఫారమ్‌లపై పట్టున్న నిపుణులకు కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి.
డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలు
ఇప్పుడు కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త స్కిల్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. డేటా నుంచి కీలకమైన అంశాలను స్వయంచాలకంగా సేకరించే నైపుణ్యం అవసరం. ఏఐ మోడల్స్‌ను వాస్తవ ప్రపంచంలో ఎలా అమలు చేయాలి, పర్యవేక్షించాలో తెలిసిన వారికి భారీ డిమాండ్ ఉంది. టెక్స్ట్, ఇమేజ్ లేదా కోడ్‌ను సృష్టించగల ఏఐ వ్యవస్థలను నిర్మించడంలో నిపుణులకు అత్యున్నత ప్యాకేజీలు లభిస్తున్నాయి.
విజయవాడలోనూ నియామకాలు
హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్‌గా గుర్తింపు సంపాదించింది. 51% వృద్ధి అంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని అర్థం. మరోవైపు విజయవాడలో 45.5% వృద్ధి నమోదవడం శుభపరిణామం. సెకండ్ గ్రేడ్ నగరాల్లో కూడా ఏఐ కంపెనీలు విస్తరిస్తున్నాయి.
సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ స్థానంలో ఇప్పుడు ఏఐ ఇంజినీరింగ్ ప్రధానంగా మారుతోంది. ఈ మార్పు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాదు, హెల్త్‌కేర్, ఫైనాన్స్, రిటైల్ వంటి రంగాల్లో కూడా ఏఐ ఇంజినీర్లకు భారీ అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో ఏఐ ప్రతి వృత్తిలో భాగమవుతుంది. కాబట్టి విద్యార్థులు, టెక్ నిపుణులు తమను తాము ఈ రంగంలో అప్‌డేట్ చేసుకుంటే విజయావకాశాలు పెరుగుతాయి. భారత ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ల దిశగా తీసుకెళ్లడంలో ఈ ‘ఏఐ విప్లవం’ కీలక పాత్ర పోషించనుంది.
