పోతుగల్లు గ్రామంలో విషాదం
పోతుగల్లు గ్రామంలో విషాదం
- వడదెబ్బతో కూలీ మృతి
మొగుళ్ళ పల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో వడదెబ్బతో ఓ కూలీ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మునిగాల చందర్ (40) రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉదయం మొక్కజొన్న పనులకు వెళ్లిన చందర్, తీవ్ర ఎండలో సాయంత్రం వరకు శ్రమించాడు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురై ఇంటికి చేరుకున్న అనంతరం స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడికి భార్య సుమలత (38), ఇద్దరు కుమార్తెలు స్పందన (16), అర్చన (14) ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న చందర్ అకస్మాత్తుగా మృతి చెందడంతో భార్య, పిల్లలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన భర్త మృతి నేపథ్యంలో కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సుమలత విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎలిగేటి తిరుపతి, వార్డ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని మృతుడికి నివాళులు అర్పించారు.
