ఈటలపై అసత్య ప్రచారం మానుకోవాలి
ఈటలపై అసత్య ప్రచారం మానుకోవాలి
అభ్యంతరకర పోస్టర్లను తీవ్రంగా ఖండించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ
బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి
నర్సంపేట, ఆంధ్రప్రభ: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముదిరాజ్‌పై అసత్య ప్రచారం, దుష్ప్రచారం మానుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ హెచ్చరించారు. ఈటల రాజేందర్‌పై వెలిసిన అభ్యంతరకర పోస్టర్ల వ్యవహారాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మొగిలి మాట్లాడారు. ప్రజల్లో ఈటల రాజేందర్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఈటల రాజేందర్ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మొగిలి మండిపడ్డారు. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిన ప్రతిసారీ ఇలాంటి ప్రచారాలు తెరపైకి రావడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
అభ్యంతరకర పోస్టర్లు అతికించిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు. ఈటల రాజేందర్‌పై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఇటువంటి కుట్రలను ముదిరాజ్ జాతి ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడని, ఇలాంటి దుష్ప్రచారాలు ఆయనకు ఉన్న ప్రజాదరణను ఏమాత్రం తగ్గించలేవని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి చొప్పరి సోమయ్య ముదిరాజ్, జీనుకుల కొమ్మాలు ముదిరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు నీరటి సదానందం ముదిరాజ్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల నరహరి ముదిరాజ్, జిల్లా కార్యదర్శి ఈర్ల నరసింహ రాములు ముదిరాజ్, జిల్లా నాయకులు నాయిని వేణు ముదిరాజ్, జిల్లా యువత కార్యదర్శి పల్లె రమేష్ ముదిరాజ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు నెదురు రాజేందర్ ముదిరాజ్, దుగ్గొండి మండల ప్రధాన కార్యదర్శి డేగల కిరణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
