వానకాల సాగుకు రైతుల సమాయత్త అవగాహన

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం పోచారం గ్రామంలో వానాకాల సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గురువారం గ్రామ పంచాయతీ భవనంలో వ్యవసాయ కళాశాల మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతు ముంగిట శాస్త్రవేత్తలు” పేరుతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సేద్య పరిజ్ఞాన శాస్త్రవేత్త ఎ. సతీష్ మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గించి అవసరానికి అనుగుణంగా వినియోగించాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. పచ్చి ఎరువుల ప్రాముఖ్యత, సాగునీటి ఆదా పద్ధతులు, పంట మార్పిడి అవసరంపై వివరించారు.
వృక్ష వ్యాధి శాస్త్రవేత్త యశస్వినీ మాట్లాడుతూ పంటలలో వచ్చే తెగుళ్లు, పురుగుల నివారణ చర్యలు, జీవ నియంత్రణ పద్ధతులు మరియు వాటి ద్వారా పర్యావరణానికి కలిగే లాభాలను రైతులకు వివరించారు.
పరకాల మండల వ్యవసాయ అధికారి సోమరాతి శ్రీనివాస్ రావు ఎరువుల యాజమాన్యం, నేల ఆరోగ్య పరిరక్షణ చర్యలు, విత్తనాల లభ్యత, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బి. రాజయ్య, పోచారం గ్రామ సర్పంచ్ మధుకర్, ఉప సర్పంచ్ కొలపాక చందు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, సుమారు 60 మంది రైతులు పాల్గొన్నారు.
