stock markets | సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు డౌన్

stock markets | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో మార్కెట్లపై బేర్ పట్టు బిగిసి, ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయింది.

ఉదయం 9.33 గంటల సమయానికి సెన్సెక్స్ 868 పాయింట్లు పతనమై 76,623 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 278 పాయింట్లు క్షీణించి 23,899 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ కూడా క్షీణిస్తోంది. నేటి సెషన్‌లో తొలిసారిగా రూపాయి 95.07 వద్ద ప్రారంభమై సరికొత్త జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

మరోవైపు ముడి చమురు ధరలు ఒక్కో బ్యారెల్‌కు 120 డాలర్లను దాటాయి. నాలుగేళ్ల తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. ఇంధన ధరలు, వడ్డీ రేట్లపై ఫెడ్ రిజర్వ్ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒత్తిడిలో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగడం కూడా దేశీయ మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా మారింది.