ఇక అడ్డదారుల్లో లైసెన్స్‌కు చెక్
ఇక అడ్డదారుల్లో లైసెన్స్‌కు చెక్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: డ్రైవింగ్ లైసెన్సుల జారీలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు షరామామూలుగా మారాయి. రోడ్డు నిబంధనలు తెలియనివారు, వాహనాలు నడపడం రానివారు కూడా డ్రైవింగ్ లైసెన్సులను అడ్డదారిలో పొందుతున్నారు. రవాణా అధికారులు కూడా కొన్నిసార్లు అక్రమాలకు పాల్పడి, ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించకుండానే లైసెన్సులు జారీ చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ఇది అత్యంత ప్రమాదకరం. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగి, అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. లైసెన్సుల జారీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను నిర్మించనుంది. రూ.35 కోట్ల వ్యయంతో 22 టూ వీలర్, 27 ఫోర్ వీలర్, 5 భారీ వాహనాల కోసం ట్రాక్‌ల అభివృద్ధికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. డ్రైవింగ్ నైపుణ్యాన్ని కచ్చితంగా పరీక్షించే టెక్నాలజీ వీటిలో ఉంటుంది. డ్రైవింగ్ సరిగా రాకపోయినా, ట్రాఫిక్ నిబంధనలు తెలియకపోయినా ఇక లైసెన్స్ పొందడం సాధ్యం కాదు.
ప్రస్తుతం మాన్యువల్ విధానం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మాన్యువల్ విధానంలో డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఇందులో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లదే కీలక పాత్ర. ఇకపై టెక్నాలజీ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. అందుకు అనుగుణంగా ఆటోమేటెడ్ ట్రాక్‌లను సిద్ధం చేస్తున్నారు.
టెస్ట్‌కు వచ్చే అభ్యర్థుల డ్రైవింగ్‌ను పరిశీలించడానికి ట్రాక్‌లపై కెమెరాలు అమర్చుతారు. నిర్ణీత సమయంలో పరీక్ష పూర్తయిందా? రెడ్ సిగ్నల్ వద్ద ఆగారా? దాటేసారా? వంటి అంశాలన్నింటినీ ఇవి రికార్డ్ చేస్తాయి. ట్రాక్‌లో వాహనం సరిగా నడిపారా లేదా అనేది కూడా టెక్నాలజీ ఆధారంగా ఖచ్చితంగా నమోదు అవుతుంది. డ్రైవింగ్ టెస్ట్‌కు దరఖాస్తు చేసిన వ్యక్తే హాజరయ్యాడా లేదా ఇతరులు వచ్చారా అన్నది ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా గుర్తిస్తారు.
త్వరలో ట్రాక్‌ల నిర్మాణం
రాష్ట్రంలో తొలి దశలో పలు జిల్లాల్లో ఆటోమేటెడ్ ట్రాక్‌లు నిర్మించనున్నారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో వచ్చే ఫలితాలను పరిశీలించి, తదుపరి ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఒక్కో ట్రాక్ నిర్మాణానికి 3 నుంచి 4 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. భూసేకరణ పూర్తిచేసి, ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్లు పూర్తవగానే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌లు అమల్లో ఉన్నాయి. అక్కడ ఆధునిక విధానంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో ఏడాదిలో తెలంగాణలో కూడా ఆధునిక టెక్నాలజీతో డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. సెన్సర్ల సాయంతో ట్రాక్ పరిధిలోని మార్గాలను గుర్తించి, డ్రైవింగ్ భద్రతను మెరుగుపరుస్తారు. కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్‌వేర్ ద్వారా ట్రాక్ వ్యవస్థను పర్యవేక్షిస్తారు. డ్రైవర్ రియల్‌టైమ్ పనితీరును విశ్లేషిస్తూ, ప్రమాదాలను నివారించడంలో ఈ టెక్నాలజీ సహాయపడుతుంది.
డ్రైవర్ చేసే పొరపాట్లు, వేగ పరిమితి ఉల్లంఘనలు వంటి అంశాలను వెంటనే గుర్తిస్తుంది. అనుభవం లేని డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడంలో, మానవ తప్పిదాలను తగ్గించడంలో ఆటోమేటెడ్ ట్రాక్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ రకాల రోడ్డు పరిస్థితులను అనుకరిస్తూ డ్రైవర్‌కు సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఈ విధంగా ఆటోమేటెడ్ ట్రాక్‌లు డ్రైవింగ్ పరీక్షలు, శిక్షణలో అత్యంత ఉపయోగకరమైన సాధనంగా మారనున్నాయి.
