బ్యాంకింగ్ సేవలు, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

బ్యాంకింగ్ సేవలు, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
కోవిడ్ అనాథలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరికీ ఆర్థిక అంశాలపై కనీస అవగాహన ఉండాలని, ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు, పొదుపు పథకాల పట్ల అప్రమత్తంగా ఉంటూనే, సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని జిల్లా లీడ్ మేనేజర్ పి. శ్రీనివాసరావు అన్నారు . భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం జిల్లా శిశు సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ లబ్ధిదారులైన కోవిడ్ అనాథ పిల్లలతో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న వివిధ బ్యాంకింగ్ సేవలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల ప్రయోజనాలను వివరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ భద్రత ప్రాధాన్యతను చెప్పారు. అనంతరం హెడ్ పోస్ట్ మాస్టర్ రంగారావు మాట్లాడుతూ.. తపాలా శాఖలో ఉన్న వివిధ రకాల పొదుపు పథకాలు, వాటి ద్వారా చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారిణి ఎస్. సువర్ణ పిల్లలతో ముచ్చటించారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు సమాజంలో మంచి ప్రవర్తనతో మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరి, డి సి పి ఓ కె.వి.రమణ, బాలల రక్షణ అధికారులు ఇప్పిలి లక్ష్మీ నాయుడు, మెట్ట మల్లేశ్వరరావు, తలే లక్ష్మణరావు పాల్గొన్నారు. వీరితో పాటు సిబ్బంది ధర్మాన సీతారాములు, మధుర మీనాక్షి, జనార్దన్, అరుణ, గీత, శ్రీనివాస రావు, పిల్లల సంరక్షకులు హాజరయ్యారు.
