కూలీలకు న్యాయం చేయండి..

కూలీలకు న్యాయం చేయండి..

  • పీడీకి వినతిపత్రం

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; జిల్లాలో చాలా గ్రామాలలో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు లేక ఆకలితో అనుమతిస్తున్నారని వారికి న్యాయం చేయాలని వ్యవసాయకార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పిడి సూర్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అవ్వకకృద్దీన్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సోమన్న సిపిఐ పట్టణ కార్యదర్శి భూమన శ్రీనివాసులు మాట్లాడారు. జిల్లాలోని ఆళ్లగడ్డ ఆత్మకూరు కొత్తపల్లి రుద్రవరం కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు అటకెక్కడంతో కూలీల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.

చింతలాయపల్లి, మదనంతపురం, ఎస్.చెన్నంపల్లి, రాఘవరాజుపల్లి గ్రామాల్లో సుమారు 400 మందికి పైగా కూలీలు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారన్నారు. వేసవి కాలం సగభాగం గడిచిన జిల్లా లోని చాలా మండలంలో ఉపాధి పనులు ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.గత రెండు నెలలుగా ‘రేపు-మాపు’ అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టిన దాఖలాలు లేవన్నారు.

మే నెల ముగిస్తే వర్షాలు ప్రారంభమై వ్యవసాయ పనులు మొదలవుతాయని, అప్పుడు ఉపాధి పనులు నిలిచిపోతాయని కూలీలు ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. చట్ట ప్రకారం ప్రతి కార్డుదారునికి 125 రోజుల పని దినాలు కల్పించాల్సి ఉండగా, అధికారుల ఉదాసీనత వల్ల కూలీల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని వారు విమర్శించారు. మహిళా కూలీలు ఇతర పనులు లేక ఇళ్ల వద్దనే ఖాళీగా ఉంటున్నారన్నారు.వారం రోజుల్లోగా పనులు ప్రారంభించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Leave a Reply