28thaprileditorial | ఆంధ్ర యూనివర్శిటీ చరిత్ర

28thaprileditorial | ఆంధ్ర యూనివర్శిటీ చరిత్ర
28thaprileditorial | వందేళ్ల గర్వకారణం ఆంధ్రా యూనివర్శిటీ
విశాఖపట్నం అభివృద్ధిలో యూనివర్శిటీ పాత్ర
ప్రముఖులు, పరిశోధనలు మరియు ప్రపంచ గుర్తింపు
శతవార్షికోత్సవాల సందడి మరియు ప్రాముఖ్యత
28thaprileditorial | ఐతరేయి బ్రాహ్మణంలో “ఆంధ్ర” శబ్దం ప్రస్తావన ఉందని చారిత్రక పరిశోధకులు పేర్కొన్నారు. ఆంధ్రజాతి ఎంత ప్రాచీనమైనదో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే తెలుగు నాట ఆంధ్ర యూనివర్శిటీ కూడా అంతే పురాతనమైనది. ఈ యూనివర్శిటీ వందేళ్ల పండుగ జరుపుకుంటున్న వేళ తెలుగుజాతి అంతా గర్విస్తోంది.
బ్రిటిష్ ఇండియాలో 13వ యూనివర్శిటీగా ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయం మొదట్లో కొంతకాలం విజయవాడ కేంద్రంగా పని చేసింది. ఇటు విజయవాడతోనూ, అటు విశాఖపట్నంతోనూ సంబంధం కలిగిన వారంతా ఈ ఆనంద క్షణాల్లో పులకిస్తున్నారు. తెలుగు జాతి చరిత్రలో ఎందరో ప్రసిద్ధులు ఈ యూనివర్శిటీ ద్వారానే పట్టాలను అందుకున్నారు.
ఈ యూనివర్శిటీకి దేశంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా మంచి పేరుంది. ప్రధానమంత్రి తరచుగా ప్రస్తావిస్తున్న “వికసిత భారత్”కు పునాదులు వేసింది ఈ యూనివర్శిటీయే. సర్ కట్టమంచి రామలింగారెడ్డి దార్శనికత, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తాత్విక చింతన జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈ విశ్వవిద్యాలయానికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టాయి.
ఆంధ్రా యూనివర్శిటీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది విశాఖనగరం. ఈ నగరానికి ఇంత పేరు రావడానికి ఈ యూనివర్శిటీ ముఖ్య కారణం. సర్ సి.వి. రామన్ వంటి నోబెల్ బహుమతి గ్రహీతలు ఇక్కడ కొంతకాలం పరిశోధనలు సాగించారు. భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ సూరి భగవంతం, అణు శాస్త్ర పరిశోధకుడు జ్ఞానానంద వంటి మహానుభావులు కూడా ఇక్కడే పరిశోధనలు చేశారు.
అనేక రంగాల్లో పరిశోధనలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కాణాచి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు వంటి ప్రముఖులు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. ఆంధ్ర యూనివర్శిటీ లక్షలాది మంది పట్టభద్రులను తయారు చేసింది. వారిలో ప్రపంచస్థాయిలో పేరు తెచ్చుకున్నవారు ఎంతో మంది ఉన్నారు.

20 మంది పరిశోధకులతో ప్రారంభమైన ఈ విద్యాలయం ఇప్పుడు మహావృక్షంలా విస్తరించింది. ఆర్థిక, అణు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక ప్రతిభావంతులను ఈ విశ్వవిద్యాలయం తయారు చేసింది. నాటకరంగ పితామహుడైన బళ్ళారి రాఘవ ఇక్కడ “థియేటర్ ఆఫ్ ఆర్ట్స్”ను క్రియాశీలంగా అభివృద్ధి చేశారు.
ఇలా ఒకరేమిటి, ఒక శాస్త్రమేమిటి—అన్నింటిలోనూ ప్రతిభ చాటిన వారెంతో మంది ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి, పరిశోధనలు నిర్వహించారు. ఇప్పటికీ విదేశాల్లోని పలు అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహిస్తున్నవారు ఈ యూనివర్శిటీకి చెందిన వారే. దేశంలోని 50 మంది విశ్వవిద్యాలయ ఉపకులపతులను అందించిన ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి కట్టమంచి రామలింగారెడ్డి వంటి మహానుభావుల కృషి విశేషం.
ప్రస్తుతం 50 దేశాలకు చెందిన 1,100 మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ యూనివర్శిటీ శతవార్షికోత్సవాలకు ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా అనేక మంది ప్రముఖులు హాజరుకావడంతో విశాఖనగరం విద్యానగరంగా మెరిసింది. ఈ పండుగ వాతావరణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంతో మంది హాజరయ్యారు. మరెంతో మంది వార్తామాధ్యమాల ద్వారా వీక్షించి ఆనందాన్ని పంచుకున్నారు.
