ఈ నెల 30న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

ఈ నెల 30న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం
- భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ పిలుపు
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 30న స్వామి వారి కళ్యాణోత్సవం , ప్రథమ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ (విడిసి) చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ సోమవారం తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
స్వామి వారి వైశాఖ సేవలు ఈ నెల 26వ తేదీన ప్రారంభమై మే 1వ తేదీ వరకు కొనసాగుతాయని ఆయన వివరించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ చతుర్దశి, గురువారం (ఏప్రిల్ 30) రోజున ఉదయం 10 గంటల 20 నిమిషాలకు చిత్త నక్షత్ర యుక్త మిధున అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుంది. ఉదయం 5:00 గంటలకు: స్వామివారికి సుప్రభాత సేవ. ఉదయం 5:30 గంటలకు: పంచామృత అభిషేకం. ఉదయం 9:30 గంటలకు: గణపతి పూజ, గౌరి పూజ, రక్షాబంధనం. ఉదయం 10:40 గంటలకు: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. కళ్యాణం అనంతరం భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు విడిసి సభ్యులు తెలిపారు.
దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడిసి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూలైన్లు , సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాష్ గౌడ్ మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహత్తర ఘట్టాన్ని తిలకించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, ఆధ్యాత్మికతకు నెలవైన ఈ కళ్యాణోత్సవంలో మండల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

