26aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

26aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

26aprSunday2026
26aprSunday2026

26aprSunday2026 | పాల ప్యాకెట్ నుంచి మొదలయ్యే డ్యాన్స్
కూరగాయల మార్కెట్‌లో స్టెప్పుల సందడి
జీతం vs ఈఎమై: అసలైన బ్రేక్ డాన్స్
ధరలు పెరిగితే ప్రభుత్వాల కొరియోగ్రఫీ
పెళ్లిళ్లు, బంగారం రేట్లు.. గ్రాండ్ పెర్ఫార్మెన్స్
సామాన్యుడే అసలైన గొప్ప డాన్సర్

26aprSunday2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏప్రిల్ 29… అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఈ రోజు సందర్భంగా ప్రపంచం మొత్తం నాట్యం గొప్పదనాన్ని, కళల వైభవాన్ని, భావ వ్యక్తీకరణలో డ్యాన్స్ ప్రాముఖ్యతను చర్చిస్తుంటే… మన సామాన్య మధ్యతరగతి కుటుంబం మాత్రం వేరే స్టెప్పుల్లో బిజీగా ఉంటుంది. అది కూచిపూడి కాదు, భరతనాట్యం కాదు, హిప్‌ హాప్ కాదు… “బడ్జెట్ బ్యాలెన్స్ డాన్స్”!

ఉదయం లేవగానే మొదటి స్టెప్ పాల ప్యాకెట్ దగ్గర మొదలవుతుంది. నిన్నటి వరకు 52 రూపాయలున్న పాలు, ఈరోజు 54 రూపాయలైతే… ఇంటి పెద్ద వెంటనే ఒక క్లాసికల్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు. అది చూసిన గృహిణి గ్యాస్ సిలిండర్ బిల్లు గుర్తొచ్చి ఫోక్ డ్యాన్స్ మూడ్‌ లోకి వెళ్తుంది. పిల్లాడు స్కూల్ ఫీజు రిమైండర్ చూపిస్తే, తండ్రి గుండెల్లో బ్రేక్‌ డాన్స్ మొదలవుతుంది.

కూరగాయల మార్కెట్‌కు వెళ్లడం అంటే ఓ ప్రత్యేక ప్రదర్శనే. టమాటా ధర చూసి ఒక్క అడుగు వెనక్కి, ఉల్లిపాయ రేటు చూసి రెండు అడుగులు పక్కకు, కొత్తి మీర అడిగితే మూడు అడుగులు బయటకు.

జీతం వచ్చేది నెల మొదటి తేదీన. కానీ అది ఐదో తేదీ దాటేలోపే ఫుల్ ఫాస్ట్ బీట్‌తో స్టేజ్ వదిలి వెళ్లిపోతుంది. ఈఎమై, కరెంట్ బిల్లు, ఇంటి అద్దె, పిల్లల ట్యూషన్ ఫీజు, మొబైల్ ఫోన్ల రీచార్జ్ లు ఇవి అన్నీ కలిసి బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్లలా ఒకే సారి రంగంలోకి దిగుతాయి.

ప్రభుత్వాలు కూడా తమ వంతు కొరియోగ్రఫీ చేస్తూనే ఉంటాయి. పెట్రోల్ ధరలు పెరిగితే తప్పదు డ్యాన్స్. కరెంట్ చార్జీలు పెరిగినా, బస్సు ఛార్జీలు పెరిగితే తడిగిణథోం..తప్పదు డ్యాన్స్.

మధ్యతరగతి మనిషి జీవితమే ఒక డాన్స్…

ఇంట్లో పెళ్లి ఉంటే మరో గ్రాండ్ పెర్ఫార్మెన్స్. బంగారం రేటు చూసి కుటుంబ సభ్యులందరూ కలసి గరగరా గ్రూప్ డ్యాన్స్ చేస్తారు. “సింపుల్‌గా చేద్దాం” అనే నిర్ణయం చివరికి డీజే స్టెప్పులతో దద్దరిల్లిపోతుంది. పెళ్లి పూర్తయ్యాక లెక్కలన్నీ చూసుకున్నాక తేలిన ఖర్చు, మిగిలిన అప్పు చూసుకుంటే అదో డాన్స్.

ఈ డ్యాన్స్‌లో ఎవరికీ ఏ అవార్డులూ, బహుమతులూ ఉండవు, రావు, ఎవరూ ఇవ్వరు. డాన్స్ చేస్తూనే చిరునవ్వుతో బతకడం, ఖర్చులను కంట్రోల్ చేసుకోగలగడం, పిల్లల కోరికలను మేనేజ్ చేయడం, పెద్దల మందులు కొనడం—ఇవి అన్నీ కలిపి చూస్తే మన సామాన్యుడే అసలైన గొప్ప డాన్సర్.

కళాకారుల నృత్యం స్టేజ్ మీద కనిపిస్తుంది. కానీ సామాన్యుల నృత్యం కిచెన్‌లో, కిరాణా షాపులో, ఈఎమై మెసేజ్ చూసిన క్షణంలో కనిపిస్తుంది. అదే అసలైన జీవన నాట్యం!

-మాధవ్

______________________++++++________________________

26aprSunday2026
26aprSunday2026

మాయా దర్పణం

స్వర్ణనగరంలో చిత్రసేనుడు అనే చిత్రకారుడు సజీవంగా ఉండే కళాఖండాలను సృష్టించి గొప్ప కీర్తి
గడించాడు. దేశ దేశాల నుండి అతడిని దర్శించుకోవడానికి ప్రజలు వచ్చేవారు.

ఒకసారి చిత్రసేనుడి అభిమాని ఒకడు అతనికి ఒక అద్భుతమైన మాయా దర్పణం’ కానుకగా ఇచ్చాడు.
ఆ దర్పణంలోని వ్యక్తి ప్రతిబింబం లోకమంతటా తిరుగుతూ, ఆ వ్యక్తిని గురించిన విశేషాలను
ఎప్పటికప్పుడు ప్రజలందరికీ చూపిస్తుంది.

మాయా దర్పణం పనితనంతో చిత్రసేనుడు ముగ్ధుడయాడు. ఆ అద్దం సాయంతో తన ప్రతిభను అందరికీ
చూపించడం మొదలుపెట్టాడు.

కేవలం చిత్రాలే కాకుండా, తను ఏమి తింటున్నాడు, ఎలా నిద్రపోతున్నాడు, ఏ క్షణంలో ఏమి చేస్తున్నాడు
అనే వ్యక్తిగత విశేషాలు కూడా దర్పణం ద్వారా లోకానికి తెలిసేలా చేశాడు. సొంత నగరం వారే కాకుండా
, పొరుగు దేశాల వారు కూడా అతని ప్రతిబింబాన్ని చూడటానికి పోటీ పడ్డారు.

కానీ కాలక్రమేణా ఒక చిక్కు వచ్చి పడింది. జనం అతనిని మెచ్చుకోవడం కంటే, “చిత్రసేనుడు ఇవాళ
తల దువ్వుకోలేదు”, “అతని బట్టల రంగు బాగాలేదు”, “అతను గీసిన బొమ్మలో గీత వంకరగా ఉంది”
అంటూ ప్రతి చిన్న విషయానికీ వంకలు పెట్టడం మొదలుపెట్టారు.

చిత్రసేనుడు విమర్శలను తట్టుకోలేకపోయాడు. అందరినీ మెప్పించాలని, అద్దంలో కనిపించే తన
ప్రతిబింబాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం తన పనిని, తన కళను పూర్తిగా వదిలేశాడు. మాయా
అద్దంలో తనని తాను ఎప్పుడూ అందంగా చూపించుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. కళకు కావలసిన
ఏకాగ్రత కరువై చివరకు కీర్తి తెచ్చిన కళా ప్రతిభను కూడా కోల్పోయాడు.

అసలైన చిత్రసేనుడు తన కళను మర్చిపోయి, కేవలం అద్దంలోని ప్రతిబింబం కోసం బ్రతికే ఒక బానిసగా
మారిపోయాడు.

విషయం తెలుసుకొన్న చిత్రసేనుడి గురువు శిష్యుణ్ణి పిలిపించుకొని, “చిత్రసేనుడా! నీవు బయట
అద్దంలో నీ రూపాన్ని చూసుకుంటున్నావు కానీ, లోపల నీలోని కళ మరణిస్తున్న ప్రమాదాన్ని
గ్రహించలేక పోతున్నావు. ఇప్పటికైనా జరిగిన తప్పును తెలుసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయి!“
అని మందలించాడు.

చిత్రసేనుడికి కనువిప్పు కలిగింది. ఆ క్షణమే ఆ మాయదారి దర్పణాన్ని పగులగొట్టేశాడు! మనసును
కలవరాని గురిచేసిన అశాంతి ఆ క్షణమే మటుమాయం అయిపోయింది. లోకం మీది వృథా ధ్యాస తగ్గి
మళ్ళీ తన కుంచెతో అద్భుతమైన చిత్రాలను గీయడం మొదలుపెట్టాడు.

ఇప్పుడు అతని చిత్రాలు అద్దం లోని ప్రతిబింబం కంటే వెయ్యి రెట్లు అందంగా ఉన్నాయి.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-

26aprSunday2026
26aprSunday2026

ఆ తెలివే ఉంటే..

మన కింద పని చేసే చిన్న స్థాయి వ్యక్తులు మనం చెప్పేది వెంటనే అర్థం చేసుకోవాలి అని , మనలాగే స్పీడ్ గా ఆలోచించాలి అని ఆశిస్తాం.అప్పుడే పనులు తొందరగా పూర్తవుతాయి అని భావిస్తాం.అయితే ఇది అన్ని వేళలా సాధ్యమా అన్నది ప్రశ్న.
నా దగ్గర పని చేసే ఒక హెల్పర్ కి జెరాక్స్ తీయమని చెబితే అతనికి నచ్చినట్టు తీస్తాడు. ముందు పేజీలో కొంత వెనక పేజీలో కొంత మేటర్ వచ్చి అపసవ్యంగా ఉంటుంది జెరాక్స్ .నాకు జెరాక్స్ ఎలా కావాలో అని అతనికి చెప్పి అర్థం చేయించేటప్పటికీ తల ప్రాణం తోకకు వస్తుంది. ‘ ఎంత చెప్పినా ఇతనికి ఎందుకు అర్థం కాదు ? ‘ అని కోపం వస్తుంది.


అలాగే ఇంకా అతనిలాంటి హెల్పర్స్ ను వృత్తి లో డెవలప్ చేయాలి అని తలచి ఒక కంప్యూటర్ ఇచ్చి డాక్యుమెంటేషన్ వర్క్ నేర్చుకోమని చెప్పాను. కాసేపు కంప్యూటర్ ముందు కూర్చుని తర్వాత నెమ్మదిగా లేచి బయట చెట్టు కిందకి వెళ్ళి అక్కడ గార్డెన్ పని చేసే వాళ్ళతో బాతాఖానీ కొడుతుండే వారు. ఒళ్ళు మండిపోయేది నాకు.
వీళ్లు ఇంతే ఎంత చెప్పి చూసినా ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రయత్నించరు . జీవితంలో ఎదగాలని ఆశించరు అని కోపం వచ్చేది. అయితే వాళ్ళు ఎందుకు అలా జడపదార్థంలా ఉంటున్నారు అని ఆలోచిస్తే నాకు ఒకటి అర్థం అయింది.
” వాళ్ళకే అన్ని తెలివితేటలు శ్రద్ధ ఉంటే మా దగ్గర అంత తక్కువ జీతానికి ఎందుకు పని చేస్తారు. వేరే బెటర్ అవకాశం చూసుకుని వెళ్ళిపోతారు కదా ” అని అనిపించింది. అప్పుడు నా కోపం తగ్గింది. అందుకే
మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే వాళ్ళ మీద కోప్పడకుండా, అసహనానికి గురి కాకుండా ఓపిగ్గా చెప్పి పని చేయించుకోండి ఫ్రెండ్స్ !!!!

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=x-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

19aprSunday2026
19aprSunday2026

ప్రోత్సాహం, ఉత్సాహం

జీవితంలో ఉత్సాహం ప్రోత్సాహం నిత్యావసరాలు. నిజమా? కూడు, గూడు, గుడ్డ చాలు అని మొన్నటి వారం చెప్పుకున్నాము కదా! చూద్దాం!

Shame is a revolution in itself అన్నాడు కార్ల్ మార్క్స్ .

ఆత్మగౌరవం మొదటి అవసరం! Self Esteem కాపాడుకోవాలి. అవమానం జరిగితే మనిషి అంతరంగంలో చనిపోతాడు! పైకి జీవచ్ఛవం అంతే! అవమానం జరిగితే మనిషి అగ్నిలా రగిలిపోతాడు!

ముందు ఒక హాస్యం, వళ్ళంతా షుగర్ ఉన్న భార్యని భర్త ఇలా అడిగాడు,

భర్త : సెల్ఫ్ కంట్రోల్ అంటే నీ దగ్గర నుండి నేర్చుకోవాలే!
భార్య : ఏ విషయంలో అంతలా పొగుడుతున్నారు?
భర్త : ఒంటి నిండా షుగర్ ఉంది, కానీ నోటి నుండి ఒక్క మాట తీపిగా రాదుగా?!

మంచి మాటకు నోరు పడిపోతుంది, చాలా మందికి! ఇంట్లో కాపురాల్లో, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క…, ఇదే సూత్రం, సత్యం వర్తిస్తుంది!

కాపురం చేస్తూ, భార్య భర్తని రోజూ అవమానం చేస్తే, లేదా భర్త భార్యని సూటి పోటి మాటలతో చంపేస్తే ఇద్దరికీ నరకం!

సాధారణంగా ఆడవాళ్లు తాము ఎలా ఉన్నా, భర్త మాత్రం నూటికి నూరు శాతం చాలా గొప్పగా పవిత్రంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే మగాళ్ళు! నిజం, ప్రతీ మనిషీ అంతే, తమ తప్పులు దాచేస్తారు! తాము అంటే ఏదో ఆ పరిస్థితుల్లో ఆ తప్పు, ఆ దొంగతనం, ఆ అబద్ధం, ఆ హింస, లేదా ఆ హత్య…. అలా చేశాము! చేయాల్సి వచ్చింది! నేను మంచోన్ని, ఏదో ఆ పరిస్థితులు! మీకు చెప్పినా అర్ధం కాదు! అవి నాకే తెలుసు! ఆ అనుభవం నా ప్రయాణం మీకు తెలీదు. నేను చేసింది తప్పు కాదు, అప్పుడు, అక్కడ, ఆ పరిస్థితుల్లో అలా చేశా!

మీకు ఏం రోగం? మంచిగా ఉండలేరా? పవిత్రంగా బ్రతకలేరా? ఎందుకు ఈ అబద్దం బ్రతుకు, మోసం, అక్రమాలు, అన్యాయాలు, హత్యలు, కొట్టడం, నరకడం, దాపరికాలు, యుద్ధాలు, అరుపులు? గొడవలు? శాంతంగా ఉన్న దాంట్లో కలో, గంజో తాగి ఈ జీవితం దాటలేరా? ఒక్క పూట తిని బ్రతక వొచ్చు! ప్రేమలు ఉంటే ఆవకాయ ముక్క చాలు! అమృతం!

ఇలా నీతుల సూక్తులు, సుద్దులు, ఒగ్గు కథలు ఎన్నో. మబ్బులో లేచాకా, బావి దగ్గరకి, పొలం దగ్గరకి వెళ్తుంటే, దారిలో దారంలా వెంట తగిలే ఊరు జనం చెప్పే కబుర్లు అవే!

సిలికాన్ వ్యాలీ, బ్రెవెర్లీ హిల్స్, బహమాస్ ఐలాండ్స్, అట్లాంటిస్ రిసార్ట్స్, ఆల్ప్స్ moutains దగ్గర, నయాగరా ఫాల్స్ దగ్గర, క్లౌడ్ లేదా క్వాంటం కంప్యూటింగ్…, ప్రోగ్రామింగ్ రాస్తూ, క్లయింట్ మీటింగ్ అటెండ్ అవుతూ…., బ్రేక్ లో పాంట్రీలో కాఫీ తాగుతూ, పబ్ లో డాన్స్ చేస్తూ…. అన్ని చోట్లా ఈ సెల్ఫ్ డబ్బా సుత్తి మనుషులు ఆపరు! మన అబద్దాల కథలకు అంతం ఉండదు.

మేం గొప్ప, మేం మాత్రమే గొప్ప. మా తప్పులు, అరుపులు తలుపులు, పిలుపులు, కలుపుల రూపురేఖలు, కేకలు… మీకు అనవసరం! బాటమ్ లైన్ ఏమిటి అంటే…, నేను అంటే ఏదో ఆ తప్పు చేశా! మీరు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి! పవిత్రంగా ఉండాలి! అటు ఇటు తొనక కూడదు, బెనక కూడదు. నాతో ఒక్క అబద్దం కూడా ఆడకూడదు! అన్నిటికంటే ముఖ్యం నేను ఆడమన్నట్టు ఆడాలి! చేపల కూర చేయాలంటే చేయాలి! లేదు కర్రీ పాయింట్ కి వెళ్ళి రొయ్యల ఇగురు తీసుకు రా అంటే తీసుకు రావాలి. అంతా నేను చెప్పినట్టు జరగాలి! ఊ అంటే ఊ అనాలి!

అన్ని చోట్లా అధికారం నాదే కావాలి! మీరంతా నా ముందు బానిసల్లా పడి ఉండాలి! ఇది మనుషుల స్వభావం! ఫ్యూడలిజం కదా! మన లోపల అడవి మనిషి అలా బ్రతికే ఉంటాడు! అవకాశం దొరికితే రంకెలు వేసి బయటకు ఉరుకుతాడు! అబ్రహం లింకన్ అంటాడు, Power does not necessarily change a person, but rather reveals their true character, integrity and morality.

ఒక మనిషి ఎటువంటి వాడో తెలియాలి అంటే వాడికి అధికారం ఇచ్చి చూడండి! లోపల అసలు రంగులు అన్నీ బయట పడతాయి! ఇక్కడ మార్పు అని కాదు, already exist అయిన అసలు మనిషి రంగులు బయటకు వస్తాయి.

అధికారం, శక్తి ఉన్నవాళ్ళు ఎంతో సహనంతో, శాంతితో, విజ్ఞతతో ఉండాలి! లేదంటే భృగుమహర్షి మహర్షి కథ మనకు తెలుసు! తన కోపమే తన శత్రువు నీతి పద్యం తెలుసు.

ఇక మన జీవితంలో, సామాన్యుల అందరి జీవితాల్లో అవసరం అయినప్పుడు ప్రోత్సాహం, ఉత్సాహం ఇచ్చే వాళ్ళు దేవుళ్ళతో సమానం! Genz కాదు, ఒకప్పుడు జీవితాల్లో పల్లెటూళ్ళు ఉన్నాయి! గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ కొందరికి దొరికిన ప్రోత్సాహం వల్ల సైంటిస్టులు అయ్యారు! తల్లితండ్రులు, పక్కింటి వాళ్ళు, లేదా ఏదన్నా గొప్ప పుస్తకం మనల్ని ఉత్సాహ పరిచి, మనలో నిద్రాణమైన శక్తిని నిద్ర లేపి గొప్ప వ్యక్తిగా అవతరించడానికి కారణం అయ్యి ఉండవచ్చు!

ఈరోజు మీరు అలా వేరే వ్యక్తులకు కారణం అవ్వండి! నేడు రాముడు మీరు కావాలి. లోపల రావణున్ని చంపాలి! రామాయణం జరిగింది అంతా ఒక శరీరంలో! అందరికీ అర్థం కావడానికి ఆ కథ, పాత్రల మాయ, వారధి ! పరస్పర దేవో భవ! మీరు గొప్పవారు, మేం కూడా గొప్పవారం! ఒకరిని ఒకరం గౌరవించుకోవాలి! వినమ్రత, కృతజ్ఞత చూపుకుందాం. మాటలు కాదు, చేతలు కావాలి, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహా పురుషులు అవుతారు!

ఆత్మ గౌరవం, ప్రోత్సాహం రెండూ కూడా నిత్యావసరాలు! అవమానం యుద్ధాలకు దారి తీస్తుంది! మహాకవి జాషువా అన్నాడు, “ఎంత కోయిల పాట వృథ అయ్యనో కదా, చిక్కు చీకటి వన సీమల యందు? ….”

సాధన ఉంటే, ఎన్నో మట్టిలో మాణిక్యాలు, ఒకరిని ఒకరం గౌరవించుకుని, ప్రోత్సాహం ఇచ్చుకుని ఎదుగుదాము! మన కోసం వేరే గ్రహం నుండి ఎవరో వచ్చి మనల్ని అభినందించరు! మనకు మనమే, మనలో మనమై, ఎదుగుదాము! గొప్ప భారత దేశ, ప్రపంచ నిర్మాణంలో భాగం అవుదాము!

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-x=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

టి టి డి స్వర్ణోత్సవ చిహ్నంగా అష్టదళ పాదపద్మారాధన 

నాలుగు దశాబ్దాలక్రితం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానాల (టి టి డి) స్వర్ణోత్సవాల సందర్భంగా తిరుమలేశుని దివ్య సేవార్చనల జాబితాలో అష్టదళ పాదపద్మారాధన సేవ చోటుచేసుకున్నది. అదికూడా స్వామి పై అత్యంత భక్తివిశ్వాసాలు కలిగిన ఒక ముస్లిం భక్తుడు సమర్పించిన 108 బంగారు కమలాలతో ఈ సేవ ప్రారంభం కావడం చెప్పుకోదగిన విశేషం.  1984లో టి టి డి ఏర్పాటై 50 ఏళ్ళు నిండిన సందర్భంగా అప్పటి టి టి డి కార్యనిర్వహణాధికారి పి వి ఆర్ కె ప్రసాద్ నేతృత్వంలో స్వర్ణోత్సవాలను వైభవంగా జరపడానికి యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

ఆ ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమలేశునికి నిర్వహించే సేవలకు అదనంగా ఒక ప్రత్యేక సేవను ప్రారంభించాలని అధికారులు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో గుంటూరు జిల్లా కు చెందిన షేక్ మస్తాన్ అనే వ్యక్తి వచ్చి తాము తరతరాలుగా తిరుమలేశుని భక్తులమని పరిచయం చేసుకున్నారు.

స్వామి వారికి చేసే అష్టోత్తర నామ పూజను దృష్టిలో ఉంచుకుని తిరుమలేశుని పాద పద్మాలకు  108 బంగారు తామర పూలను  సమర్పించాలన్న  తన తాత, తండ్రుల మొక్కు కు అవసరమైన బంగారు పుష్పాలు తన హయాంలో సిద్ధం అయ్యాయని, ఆ పుష్పాలను సమర్పించడానికి వచ్చానని చెప్పారు. స్వర్ణోత్సవాల సందర్భంగా ఏదో ఒక కొత్త  సేవను ప్రారంభించాలని ఆలోచిస్తున్న టి టి డి అధికారులు  అది భగవంతుని సంకల్పంగా భావించారు. 

వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఏ సేవలు లేని మంగళవారం అష్ట దళ స్వర్ణ పద్మ పూజ అనే పేరుతో కొత్త  సేవను ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ సేవ కోసం మస్తాన్ కుటుంబం  మూడు తరాల నుంచి సిద్ధం చేస్తూ వచ్చిన (ఒక్కొక్క కమలం 23 గ్రాముల బరువున్న) 108 బంగారు కమలాలను వినియోగించడం మొదలైంది. ఆ సేవ కాలక్రమంలో అష్టదళ పాదపద్మారాధనగా పేరొంది ఆర్జిత సేవగా ఇప్పటికీ కొనసాగుతోంది. 

మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఆ సేవను గర్భాలయంలోని  మూలమూర్తికి నిర్వహిస్తారు. స్వామి పాదాల చుట్టూ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక పై ఆ పూలను అమర్చే అర్చకులు  అష్టోత్తర శత నామ పూజను నిర్వహిస్తారు. కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి తనయందు  భక్తి విశ్వాసాలను కలిగియున్నవారిని మతాలకు అతీతంగా  కటాక్షిస్తారనే సత్యానికి నిదర్శనంగా తిరుమలక్షేత్రంలో నిర్వహించే వారోత్సవసేవలలో అష్ట దళ పాదపద్మారాధన సేవ కొనసాగుతోంది. 

ఓం నమో వెంకటేశాయ

000000000000000000000000000

click here for more

Leave a Reply