12 years | తెలంగాణ ఆత్మ కోల్పోయిందన్న ఆవేదన
12 years | తెలంగాణ ఆత్మ కోల్పోయిందన్న ఆవేదన
12 years | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ రథం దారితప్పిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమ రథం దారితప్పిందని కవిత ఆరోపించారు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచినా ప్రజల కలలు నెరవేరలేదని వ్యాఖ్యానించారు. “కేసీఆర్ గారు ఇప్పుడు మన మనిషి కాదు.. ఆయనో మర మనిషి” అంటూ తీవ్రంగా ఎద్దేవా చేశారు. ప్రజలకు కష్టం వచ్చినా ఆయన స్పందించడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛ కరువైందని, ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో అన్న భయంతో ప్రజలు బతుకుతున్నారని కవిత అన్నారు. తెలంగాణ దారుణమైన నిఘా నీడలో మగ్గిపోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఒక అమ్మగా పరిణతి చెందాలనుకుంటున్నానని, అమ్మతనంతో పనిచేస్తే ప్రజల కష్టాలను అడ్డుకోవచ్చని భావోద్వేగానికి లోనయ్యారు.
తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని, కానీ ఆనాడు పాలించిన కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నానని ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలు అలాంటి వ్యాఖ్యలపై మౌనం పాటించడం దారుణమన్నారు.
మొదటి ముఖ్యమంత్రి పాలనలో భారీగా ఖర్చు చేసినా, పరిమిత ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిందని విమర్శించారు. సింగరేణి కార్మికుల పక్షాన పోరాడతానని హామీ ఇచ్చారు. పాత కేసీఆర్ అయితే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసేవారని, కానీ మారిన కేసీఆర్ జాతీయ రాజకీయాల వెంట పడ్డారని అన్నారు.
కేటీఆర్ రాజకీయాలపై కూడా ఆమె విమర్శలు చేశారు. ప్రజల ఇళ్లను కూల్చుతున్న సమయంలో ఆదుకోవాల్సిన నాయకత్వం కనిపించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌లో మార్పు వస్తుందని చాలా కాలం వేచి చూశానని, కానీ మార్పు రాకపోగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతానని కవిత స్పష్టం చేశారు.
