ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం విస్తరించాలి
ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం విస్తరించాలి
- కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, ఆంధ్ర ప్రభ : ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం విస్తరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. ప్రకృతి సాగును విస్తృతంగా ప్రోత్సహించడంలో పీఎండీఎస్ (Pre-Monsoon Dry Sowing) కీలక పాత్ర పోషిస్తుందని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో నిర్వహించిన “ధర్తీ మాతా బచావ్ అభియాన్” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు పీఎండీఎస్ విత్తనాల కిట్లను పంపిణీ చేసి, ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. అనంతరం రైతు కె. రాముడు పొలంలో స్వయంగా విత్తనాలు చల్లి, పీఎండీఎస్ విధానం ప్రయోజనాలను వివరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎండీఎస్ అంటే వర్షాధారిత ప్రాంతాల్లో భూమిలో తేమ లేని సమయంలో ముందస్తుగా విత్తనాలు చల్లే విధానమని తెలిపారు. మే-జూన్ నెలల్లో వర్షాలు పడకముందే సుమారు 30 రకాల నవధాన్యాలు, ఇతర విత్తనాలను కలిపి పొలాల్లో చల్లడం ద్వారా వర్షాలు ప్రారంభమైన వెంటనే అవి మొలకెత్తి భూమికి అవసరమైన పోషకాలను అందిస్తాయని వివరించారు.
ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా రైతులు దీర్ఘకాలిక లాభాలు పొందగలరని కలెక్టర్ పేర్కొన్నారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఓ మహిళ రైతు 70 సెంట్ల భూమిలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి సంవత్సరానికి రూ.2.50 లక్షల ఆదాయం పొందిన విషయాన్ని ఉదాహరణగా వివరించారు. రసాయన ఎరువులతో సాగు చేసిన పంటలతో పోలిస్తే సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలు నాణ్యతలో మెరుగ్గా ఉంటాయని చెప్పారు.
మొదటిసారి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతులు తమ భూమిలో కనీసం 50 శాతం విస్తీర్ణంలో ఈ విధానాన్ని అమలు చేసి ఫలితాలను పరిశీలించాలని సూచించారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడటం ప్రతి రైతు బాధ్యతగా భావించాలని, రసాయన వ్యవసాయం వల్ల భూసారం తగ్గడం, అనారోగ్య సమస్యలు పెరగడం జరుగుతోందని హెచ్చరించారు.
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటలు సాగు చేయాలని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం పొందడంతో పాటు సేంద్రియ ఎరువులు సులభంగా సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ సంఘాల్లో సభ్యత్వం పొందితే ఆధునిక యంత్రాలు తక్కువ ధరకు లభిస్తాయని పేర్కొన్నారు.
డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతరులకు 60-70 శాతం వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. “జలధార–జలహారతి” వంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తున్నప్పటికీ, ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, తహశీల్దార్ ఆంజనేయులు, గ్రామ పెద్దలు జుబేదా, రైతులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
